టీడీపీలో ఆగ్రహ జ్వాల

23 Mar, 2024 04:57 IST|Sakshi

టికెట్ల కేటాయింపుపై భగ్గుమన్న నిరసనలు 

పార్టీ జెండాలు, కరపత్రాలు కాల్చివేత 

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలు దహనం 

ఏలూరుజిల్లా కామవరపు కోటలో టైర్లకు నిప్పు 

శ్రీకాకుళం, పాతపట్నం, ఎస్‌కోటలో నాయకుల తిరుగుబాటు.. పలువురి నాయకుల రాజీనామా 

ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగాలని యోచన 

సత్యవేడులో ఆదిమూలంను మార్చాలని కేడర్‌ డిమాండ్‌  

సాక్షి నెట్‌వర్క్‌: టీడీపీలో మూడోవిడత టికెట్ల జాబితాపై ఆపార్టీ శ్రేణుల్లో ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. టికెట్‌ మంటలు రాజుకుంటున్నాయి. ఇప్పటికే టికెట్‌ వస్తుందని ఆశపెట్టుకున్నవారంతా జాబితాలో తమ పేర్లు లేకపోవడంతో ఆందోళనబాట పట్టారు. తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వారి అనుయాయులు పార్టీ జెండాలను, ఫ్లెక్సీలను మంటల్లో వేసి తగులబెట్టారు. మొత్తమ్మీద రాష్ట్ర వ్యాప్తంగా తలెత్తిన వ్యతిరేక పవనాలు పార్టీ అధిష్టానం కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. శ్రీకాకుళంలో గుండ లక్ష్మీదేవి, పాతపట్నంలో కలమట వెంకటరమణను కాదని రూ. కోట్లు ముట్టచెప్పినవారికి టికెట్లు ఇచ్చారంటూ టీడీపీలోని సీనియర్‌ కేడర్‌ రగిలిపోయింది.

పార్టీ కరపత్రాలు, బ్రోచర్లు, ఇతరత్రా మెటీరియల్‌ను తగలబెట్టి తమ నిరసన తెలియజేశారు. ‘తెలుగుదేశం పార్టీ వద్దు.. సైకిల్‌ గుర్తు అసలొద్దు.. టీడీపీ జెండాలు.. చంద్రబాబు అజెండా మనకొద్దు’ అంటూ శ్రీకాకుళంలో ఆ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళంలో సీనియర్‌ నాయకుడు గుండ అప్పల సూర్యనారాయణ, లక్ష్మీదేవి దంపతులకు పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, ఆమెకు సీటు రాకుండా అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు అడ్డుకున్నారని తెలుగు తమ్ముళ్లు ఒంటి కాలితో లేచారు. ఏ మాత్రం పట్టులేని గొండు శంకర్‌కు టికెట్‌ ఇచ్చి, సీనియర్లకు వెన్నుపోటు పొడిచారని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలను ధ్వంసం చేసి, మంటల్లో తగలెట్టారు. రానున్న ఎన్నికల్లో ఎంపీ రామ్మోహన్‌నాయుడిని ఓడించి తీరుతామని శపథం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని గుండ ఫ్యావిులీపై అనుచరులంతా ఒత్తిడి చేశారు. లేదంటే వైఎస్సార్‌సీపీలో చేరాలని కోరారు. శుక్రవారం సాయంత్రం తన అనుయాయుల అభీష్టం మేరకు ఇండిపెండెంట్‌గా పోటీకి దిగనున్నట్టు మాజీ శాసనసభ్యురాలు గుండ లక్ష్మీదేవి ప్రకటించారు. అప్పలసూర్యనారాయణ కూడా ఇండిపెండెంట్‌గా ఎంపీగా బరిలోకి దిగాలని కార్యకర్తలు కోరగా ఆదివారం దీనిపై నిర్ణయం తీసుకుందామని చెప్పారు.

పాతపట్నంలో మూకుమ్మడి రాజీనామాలు 
పాతపట్నంలో మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణకు చంద్రబాబు మొండి చేయి చూపడంతో ఆయన అనుచరులు మండిపడ్డారు. పది కార్లు వేసుకుని, పది­మందిని వెంట బెట్టుకుని, నియోజకవర్గంలో షో చేసిన మామిడిగోవిందరావుకు టికెట్‌ ఇవ్వడంపై వా­రు నిరసన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని సవాల్‌ చేశారు.

ఈ సందర్భంగా పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, కొత్తూరులో కలమటకు మ­ద్దతుగా రోడ్డెక్కి టీడీపీ ఫ్లెక్సీలు, కరపత్రాలను తగలబెట్టారు. పార్టీ మండలాధ్యక్షులు సైతం రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు తదితరుల ఫ్లెక్సీలను మంటల్లో దహనం చేశారు. నిరసన ర్యాలీలు చేసి, కలమట అనుచరులంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలు చేస్తున్నట్టు ప్రకటించారు. 

రాష్ట్ర కార్యదర్శి పదవికి గొంపకృష్ణ రాజీనామా
విజయనగరం జిల్లా శృంగవరపుకోట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పేరును ఖరారు చేయడంతో ఇప్పటివరకూ అక్కడి టికెట్‌కోసం ఎదురుచూసిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ అసంతృప్తితో రగిలిపోయారు. పార్టీ పదవికి రాజీనామా చేసి, ఇండిపెండెంట్‌గా బరిలో దిగనున్నట్టు ప్రకటించారు.

ఆయనతో పాటు వేపాడ, కొత్తవలస, జామి మండలాల టీడీపీ అధ్యక్షులు గొంప వెంకటరావు, గొరపల్లి రాము, లగుడు రవికుమార్, విశాఖ పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రాయవరపు చంద్రశేఖర్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మడి భారతి వారి పదవులకు రాజీనామా చేశారు.

ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం తన అభిమానులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గొంపకృష్ణ మాట్లాడుతూ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానని ప్రకటించారు.  టీడీపీ కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి ఉన్న తెలుగుదేశం పార్టీ సైకిల్‌ గుర్తును పెయింట్‌తో చెరిపేశారు. 

అమలాపురంలో అసంతృప్తి జ్వాలలు
అమలాపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావును, పార్లమెంట్‌ అభ్యర్థిగా గంటి హరీష్‌ను పార్టీ అధిష్టానం ఎంపిక చేయడంపై అక్క­డి నాయకులు మండిపడుతున్నారు. ఆనందరావుకు సీటు రాకుండా రాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు ఆధ్వర్యంలో పరమట శ్యామ్‌కుమార్‌ గట్టి ప్రయత్నం చేశారు. అయినా ఆయనకే టికెట్‌ కేటాయించడంతో నాయకులు, కార్యకర్తలు తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఎన్నికలలో తగిన గుణపాఠం చెబుతామని వారు హెచ్చరించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిన వారిలో జనసేన నాయకులు కూడా ఉండటం గమనార్హం. 

ఆదిమూలంను మార్చాలని డిమాండ్‌
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోనేటి ఆదిమూలంను ప్రకటించడంపై సత్యవేడు, నాగలాపురం మండలాల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మదనంబేడులో శుక్రవారం సాయంత్రం పంచాయతీ పరిధిలో తెలుగు త­మ్ముళ్లు నిరసన తెలిపారు. ఆదిమూలం టీడీపీ కార్యకర్తలపై చిన్నపాటి గొడవలను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు పెట్టించారని గుర్తుచేశారు. అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేశారు. నాగలాపురంలో కూడా పలువురు తెలుగు తమ్ముళ్లు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు.

రగిలిపోతున్న పోతిన మహేష్‌
విజయవాడ వెస్ట్‌ నుంచి సీటు ఆశిస్తున్న పోతిన మహేష్‌ భంగపాటుకు గురయ్యాడు. కానీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయిస్తున్నట్లు పవన్‌ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో కంగుతిన్న మహేష్‌ డివిజన్‌ ఇన్‌చార్జిలు, కార్యకర్తలతో సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. పవన్‌ నమ్మించి మోసం చేశారని, ఇలాగైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని హెచ్చరికలు పంపారు.

పురందేశ్వరి కోసం మమ్మల్ని బలి చేస్తారా?
విపక్ష కూటమిలో రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానం అభ్యర్థిత్వం కలకలం రేపుతోంది. టీడీపీ ప్రకటించిన మూడో జాబితాలో టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు లేకపోవడంపై ఆ వర్గం నేతలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జనసేన కోసం ఇప్పటికే రాజానగరం ఎమ్మెల్యే సీటును త్యాగం చేసిన ఆయనకు.. ఇప్పుడు బీజేపీ కోసం ఎంపీ స్థానం వదుకోవాల్సి వస్తుందన్న ఆందోళన నెలకొంది.

ఎంపీ టికెట్‌ అయినా వస్తుందనుకుంటే అదీ దక్కే అవకాశం కనిపించకపోవడంతో ఆ వర్గం టీడీపీ అధినేతపై మండిపడుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిని రాజమహేంద్రవరం ఎంపీగా బరిలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతూండటంతో తన రాజకీయ భవిష్యత్తు ఏమిటని ఆయన కార్యకర్తల వద్ద ఆ­వే­దన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుంటే నట్టేట ముంచారని ఆయన పేర్కొన్నట్టు తెలిసింది.

ఎక్కడ ‘పుట్టా’వో మాకెందుకు?
ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా, టీటీడీ మాజీ చైర్మన్, కడప జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌ యాదవ్‌ కుమారుడు పుట్టా మహేష్‌ను ఎంపిక చేయడంపై అక్కడి బీజేపీ నేతలు మండిపడుతున్నారు. టికెట్‌ ఇస్తామని సింగపూర్‌లో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆర్థికంగా ఉపయోగించుకున్నారని, టీడీపీ జెండా మోయటానికే జనాలు ముందుకు రాని సందర్భంలో ఏడాది పాటు కష్టపడి పనిచేశానని ఎన్‌ఆర్‌ఐ గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ చెప్పారు. తన అసంతృప్తిని వీడియో రూపంలో విడుదల చేశారు. బీసీలంటే యనమల కుటుంబం ఒక్కటేనా, ఆయన కుటుంబంలోనే మూడు టికెట్లు ఇస్తారా, మిగతా వెనకబడిన కులాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా గ్రేట్‌ అని.. ఆయన ధైర్యాన్ని ఎప్పుడూ మెచ్చుకుంటానని, తాను ఆయనపై ఏమైనా విమర్శలు చేసి ఉంటే పార్టీ పరంగా తప్ప వేరేగా కాదని వివరించారు. ఈ నెల 25న కామవరపుకోటలో దగాపడ్డ బీసీ సోదరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించి భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ‘కడప నేత వద్దు– స్ధానిక బీజేపీ నేతలకే టికెట్‌ ఇవ్వాల’ని పార్లమెంట్‌ బీజేపీ కన్వీనర్‌ గాది రాంబాబు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్లు, పార్టీ వివిధ విభాగాల నేతలు విలేకరుల సమావేశంలో డిమాండ్‌ చేశారు.

స్థానిక అశోక్‌ నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఏలూరు టికెట్‌ విషయంలో బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వాలు పునరాలోచన చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఏలూరు జిల్లా కామవరపుకోట చెక్‌పోస్ట్‌ సెంటర్‌లో గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ మద్దతుదారులు శుక్రవారం రాత్రి టైర్లకు నిప్పంటించి నిరసన తెలిపారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు.  

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers