బీజేపీ సీరియస్‌.. పురంధేశ్వరి పోస్ట్‌ ఊష్టింగ్!

26 Feb, 2024 11:09 IST|Sakshi

పురంధేశ్వరిపై బీజేపీ సీరియస్

తిన్నింటి వాసాలు లెక్కేసినందుకే వేటు 

ఏ ఆడపిల్ల అయినా పుట్టిల్లు బాగును కోరుతుంది. మెట్టినింటి మంచిని కోరుతుంది. కానీ విలువలు, నీతి ఉన్నవాళ్లు ఎవరూ తమకు నీడనిచ్చిన చెట్టు కూలిపోవాలని కోరుకోరు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం తిన్నింటి వాసాలు లెక్కేశారు. అందుకే ఆమెను పదవి నుంచి తీసేయాలని పార్టీ పెద్దలు భావించారని తెలుస్తోంది.

ఎన్టీఆర్‌ కుమార్తె అయినా ఆమె తెలుగుదేశంలో ఉండకుండా కాంగ్రెస్‌లో చేరి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. మన్మోహన్ సింగ్ సారధ్యంలోని యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేసారు. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో ఓడిపోవడంతో ఎటూ వెళ్లే వీల్లేక బీజేపీలో చేరారు. పోన్లే అని ఆమెకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టి పార్టీని బలోపేతం చేయాలని ఆదేశించింది.

కానీ, మనసోచోట మనువోచోట అన్నట్లుగా ఉండే పురంధేశ్వరి తలుపులన్నీ తెలుగుదేశంవైపే ఉన్నాయి. తన తండ్రి పెట్టిన పార్టీ, తన అక్క భర్త చంద్రబాబు నడుపుతున్న తెలుగుదేశం బలోపేతం అవ్వాలని పురంధేశ్వరి తపిస్తూ ఉండేవారు. ఆమె పార్టీ పదవి చేపట్టిన నాటి నుంచీ తెలుగుదేశం, బీజేపీ మధ్య పొత్తు కుదర్చడానికి మాత్రమే యత్నించారు తప్ప పార్టీని బలోపేతం చేయడానికి ఎలాంటి కృషి చేయలేదు. దీనికి సంబంధించి తాజాగా అధిష్టానం వద్ద ఇంకో ఆధారం కూడా ఉందని తెలుస్తోంది. 

సొంతపార్టీని బలోపేతం చేయడానికి బదులు తెలుగుదేశాన్ని ఉద్ధరించేందుకు ఆమె కుయుక్తులు పన్నుతున్నట్లు బీజేపీ పెద్దల వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఆంధ్రాలో అధికార వైఎస్సార్‌సీపీలో టిక్కెట్లు దక్కని కొందరు నాయకులు బీజేపీలో చేరాలని ప్రత్నించి, ఆమెతో మాట్లాడగా దానికి ఆమె సంతోషంగా ఒప్పుకుని పార్టీ కండువా వేసి ఆహ్వానించాల్సి ఉండగా దానికి విరుద్ధంగా ఆమె కుట్రలకు పాల్పడ్డారు. ఆంధ్రాలో బీజేపీలో ఎందుకు చేరడం.. మేము చేరి తప్పు చేసాం.. పార్టీకి ఇక్కడ ఏమీ ఫ్యూచర్ లేదు. పార్టీ బలం అయ్యే అవకాశం లేదు. మీరు వెళ్లి టీడీపీలో చేరండి నేను చంద్రబాబుతో మాట్లాడతాను వెళ్ళండి అని సలహా ఇచ్చారట.

దీంతో, బీజేపీలో చేరేందుకని వెళితే ఆవిడ ఏమిటి ఇలా చెబుతోంది అని ఆశ్చర్యపోయారట. దానికితోడు ఆమె పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశానికి ప్రయోజనం కలిగేలా చేసిన కొన్ని వ్యాఖ్యలకు సంబంధించిన ఆడియో క్లిప్స్ కూడా ఢిల్లీ పెద్దలకు చేరినట్లు తెలిసింది. దీంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం.. నీడనిచ్చిన చెట్టును కూల్చేయడం లాంటి అనైతిక చర్యలకు పురంధేశ్వరి పాల్పడుతోందని ఆగ్రహం చెందిన బీజేపీ అధిష్టానం ఆమెను పదవిలోంచి తొలగించాలని డిసైడ్ అయిందని సమాచారం. ఈమేరకు ఆమెకు ఇప్పటికే చెప్పేశారని, త్వరలోనే ఆమెకు ఉద్వాసన తప్పదని అంటున్నారు.

- సిమ్మాదిరప్పన్న

whatsapp channel

మరిన్ని వార్తలు