‘జై శ్రీరాం’ అంటూనే ఆకలితో చావాలనుకుంటున్నారు: మోదీపై రాహుల్‌ ఫైర్‌

5 Mar, 2024 17:17 IST|Sakshi

భోపాల్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత, వయనాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఓ వైపు దేశంలో నిరుద్యోగం, ఉపాధి లేక ఆకలి చావులు పెరిగిపోతున్నాయని.. మరోవైపు ప్రధాని మోదీ మాత్రం ‘జై శ్రీరామ్‌ అంటూ నినాదాలు చేయాలని చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజలతో 'జై శ్రీరాం' అని చెప్పిపిస్తూ.. వారు ఆకలితో చనిపోవాలని  ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు.

మంగళవారం మధ్యప్రదేశ్‌లోని సారంగ్‌పూర్‌లో భారత్‌ జోడో న్యాయ యాత్ర యాత్రలో భాగంగా రాహుల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.. యాత్రలో భాగంగా రాహుల్‌కు ‘ మోదీ, మోదీ, జై శ్రీరాం’ అనే నినాదాలతో బీజేపీ కార్యకర్తలు వ్యంగ్యంగా ఆహ్వానం పలికారు.

బీజేపీ శ్రేణుల చర్యపై స్పందించిన రాహుల్‌.. మోదీపై విమర్శలు గుప్పించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుందని, ఉద్యోగాలు లేక యువత సోషల్‌ మీడియాలో రోజంతా రీల్స్‌ చూస్తూ గడుపుతున్నారని అన్నారు. ‘మీరు రోజంతా ఫోన్‌లు చూస్తూ.. జై శ్రీరామ్ అని నినాదాలు చేసి, ఆకలితో చనిపోవాలని ప్రధాని కోరుకుంటున్నారు’ అని ఆరోపించారు.
చదవండి: రాజకీయాల్లోకి అభిజిత్ గంగోపాధ్యాయ.. త్వరలో ఆ పార్టీలోకి

కేంద్ర ప్రభుత్వ అగ్నివీర్ పథకంపై రాహుల్‌ మాట్లాడుతూ.. గతంలో సాయుధ దళాలు యువతకు రెండు హామీలు ఇచ్చాయని, యువతకు పెన్షన్ ఇవ్వడంతోపాటు వారు మరణిస్తే సరైన గౌరవం పొందుతారని చెప్పినట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం అగ్నివీర్‌ పథకం కింద నలుగురిని తీసుకొని ముగ్గురిని వదిలేస్తారని.. ఆ ముగ్గురిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే ఉంటారని విమర్శించారు. 

పాకిస్తాన్‌తో పోలిస్తే భారతదేశంలో నిరుద్యోగం రెట్టింపుగా ఉందని రాహుల్‌ అన్నారు. ఆదివారం గ్వాలియర్‌లో భారత్ జోడో న్యాయ్ యాత్ర మధ్య జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ.. భారత్‌లో నిరుద్యోగం 23 శాతంగా ఉంటే పాక్‌లో  12 శాతం ఉందన్నారు. బంగ్లాదేశ్, భూటాన్‌ల కంటే దేశంలో నిరుద్యోగ యువత సంఖ్య ఎక్కువగా ఉందని, భారతదేశ నిరుద్యోగిత రేటు గత 40 ఏళ్లలో ఇదే అత్యధికమని ఆయన పేర్కొన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు