అమరరాజాపై కక్ష సాధింపుల్లేవు

5 Aug, 2021 04:40 IST|Sakshi

ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి

తిరుపతి మంగళం: అమరరాజా ఫ్యాక్టరీలపై ఎలాంటి కక్ష సాధింపుల్లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తిరుపతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరరాజా ఫ్యాక్టరీల ద్వారా వెలువడే కాలుష్యంతో ప్రజల ప్రాణాలకు, పర్యావరణానికి హాని కలుగుతోందని పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ), హైకోర్టు పలుమార్లు స్పష్టం చేశాయని గుర్తుచేశారు. అయినా ఫ్యాక్టరీల తీరులో మార్పు రాకపోవడంతో వాటిని మూసివేయాలని పీసీబీ ఆదేశాలు జారీ చేసిందన్నారు. అమరరాజా సంస్థల యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించినా అదే తీర్పు ఇచ్చిందన్నారు.

విశాఖలో విషవాయువు వెలువడుతున్న ఓ ఫ్యాక్టరీని మూసివేసినట్లు ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలోని 66 పరిశ్రమలకు నోటీసులిచ్చామని తెలిపారు. కొన్ని పత్రికలు, చానళ్లు మాత్రం కక్షసాధింపుతో అమరరాజా ఫ్యాక్టరీలు పక్కరాష్ట్రాలకు తరలిపోయేలా ప్రభుత్వం చేస్తోందని చెప్పడం దారుణమన్నారు. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. టీడీపీ పోతూపోతూ రాష్ట్రాన్ని ఎంతగా నష్టాల్లోకి నెట్టేసిందో అందరికీ తెలుసన్నారు. అప్పులు చెల్లించాలని ఆర్‌బీఐ నుంచి హెచ్చరికలు వచ్చాయని పేర్కొన్నారు. కోవిడ్‌తో రాష్ట్రానికి ఆర్థికంగా ఎంతో నష్టం జరిగినప్పటికీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు ఏవీ ఆగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.  

మరిన్ని వార్తలు