చంద్రబాబు విష ప్రచారాల వల్లే.. ఇదంతా: సజ్జల

7 May, 2021 13:42 IST|Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌ కట్టడిపై చంద్రబాబు నాయుడు విషప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. కొత్త వేరియంట్‌ అంటూ అసత్య ప్రచారాలు చేసినందు వల్ల ఇప్పటికే ఢిల్లీ, ఒడిశా ప్రభుత్వాలు.. ఏపీ, తెలంగాణ ప్రజల ప్రయాణాలపై నిర్బంధం విధించాయన్నారు. ఎన్‌440కే స్ట్రెయిన్‌ వ్యాప్తి అనే అభూత కల్పనను చంద్రబాబు సృష్టించారని, రాజకీయం కోసమే ఇలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కరాష్ట్రంలో కూర్చొని ఏపీని చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రజలను భయాందోళనలకు గురిచేయడం మంచిది కాదని హితవు పలికారు. కోవిడ్ కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతోందని పునరుద్ఘాటించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడిన సజ్జల.. ‘‘ఎన్‌440కే అంత ప్రమాదం కాదని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. కేరళ లాంటి రాష్ట్రాల్లో ఎన్‌440కే స్ట్రెయిన్‌.. చాలా రోజుల నుంచే ఉందని సీసీఎంబీ చెబుతోంది. సీసీఎంబీ, సెంట్రల్ బయో టెక్నాలజీలు.. ఈ స్ట్రెయిన్‌తో ప్రమాదం లేదని ఇప్పటికే స్పష్టం చేశాయి ప్రభుత్వం ఏం మంచి చేసినా విమర్శలు చేయడం చంద్రబాబుకు అలవాటైంది. ఆయన ఏం చేసినా ఎదుర్కొనే శక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఉంది. కానీ ఇలా ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ప్రజలను భయపెట్టే విధంగా వ్యవహరించడం తగదు. ఇప్పటికైనా చంద్రబాబు సంయమనంతో మాట్లాడాలి. ప్రభుత్వానికి ప్రతిపక్షనేతగా బాబు సలహాలు ఇవ్వాల్సింది పోయి.. ప్రజలను మరింత భయందోళనలకు గురిచేయడం సరికాదు. చంద్రబాబు చేస్తోన్న విషప్రచారానికి కేసులు పెట్టాలి’’ అని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తీరును విమర్శించారు. ప్రజలు ఎక్కడికక్కడ బాబు నిలదీయాలన్నారు.

ఇక కరోనా కట్టడికై ప్రభుత్వం చేపడతున్న చర్యల గురించి మాట్లాడుతూ.. ‘‘ఏపీలో అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. టీకా డోసులు కావాలని ఎప్పటికప్పుడు కేంద్రానికి సీఎం లేఖలు రాస్తున్నారు వ్యాక్సిన్లు ఎవరి నియంత్రణలో ఉన్నాయో చంద్రబాబుకు తెలియదా? మొదటగా ఏపీకి 25 లక్షల టీకాలు కావాలని.. ఆ తర్వాత 60 లక్షల టీకాలు కావాలని కేంద్రానికి లేఖలు రాశాం. కేంద్రం సరిపడా డోసులు ఇస్తే అందరికి ఇచ్చేస్తాం’’ అని సజ్జల పేర్కొన్నారు.

చదవండి: విపత్తులోనూ విష రాజకీయాలా?

మరిన్ని వార్తలు