Nagpur: ఆర్‌ఎస్‌ఎస్‌ పురిటి గడ్డలో బీజేపీ గెలిచింది మూడుసార్లే!

23 Mar, 2024 09:58 IST|Sakshi

మహారాష్ట్రలోని 48 లోక్‌సభ స్థానాల్లో నాగ్‌పూర్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. నాగ్‌పూర్ విదర్భ ప్రాంతం పరిధిలోకి వస్తుంది. నాగ్‌పూర్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు పురిటి గడ్డగా చెబుతారు. మహారాష్ట్రలోని ఐదు కీలక స్థానాలకు ఏప్రిల్ 19న మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. వాటిలో నాగ్‌పూర్‌ కూడా ఉంది. 

ప్రస్తుతం కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానానికి ఎంపీగా ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి సాధారణ ఎన్నికలు 1952లో జరిగాయి. నాడు కాంగ్రెస్ అభ్యర్థి అనసూయాబాయి కాలే ఇక్కడి నుంచి  గెలిచారు. నాగ్‌పూర్‌ సీటు కొన్నాళ్లు కాంగ్రెస్‌ ఖాతాలోనే ఉంది. 1996లో బీజేపీ తొలిసారి ఇక్కడ నుంచి గెలుపొందింది. నాగ్‌పూర్ ఎన్నికల చరిత్రలో ఎన్నో మలుపులు ఉన్నాయి.

1952లో మొదటి సాధారణ ఎన్నికల్లో నాగ్‌పూర్ స్థానం  కాంగ్రెస్‌కు దక్కింది. 1962లో రాజకీయ నేత మాధవ్ శ్రీహరి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. 1967లో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఆర్ దేవ్‌ఘరే విజయం సాధించారు. 1971లో నాగ్‌పూర్‌లో కాంగ్రెస్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఈసారి సుభాష్ చంద్రబోస్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ నాగ్‌పూర్ స్థానాన్ని కైవసం చేసుకోగా, భోటే జంబువంతరావు ఎంపీ అయ్యారు. 1977లో కాంగ్రెస్ ఇక్కడ తిరిగి  అధికారం చేజిక్కించుకుంది. 1980 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత భోటే జంబువంతరావు విజయం సాధించారు. 1984లో కాంగ్రెస్ నేత బన్వరీలాల్ భగవాన్‌దాస్ విజయం సాధించారు. బన్వరీలాల్ 1989 సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ను విజయపథంలో నడిపించారు.

1991 సార్వత్రిక ఎన్నికల్లో బన్వరీలాల్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. అయితే ఈసారి బన్వరీలాల్ ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి దత్తాజీ రఘోబ్జీ మేఘే ఎంపీగా ఎన్నికయ్యారు. 1996లో బీజేపీ మరోసారి బన్వరీలాల్‌కు టికెట్ ఇచ్చింది.  అప్పుడు తొలిసారిగా నాగ్‌పూర్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. 1998లో కాంగ్రెస్ పార్టీ నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. విలాస్ ముత్తెంవార్ ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 1999, 2004, 2009లలో వరుసగా మూడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 

2014లో మోదీ వేవ్ కారణంగా చాలా విరామం తర్వాత బీజేపీ తిరిగి నాగ్‌పూర్ సీటును సొంతం చేసుకుంది. ఈసారి నితిన్ గడ్కరీ ఎంపీ అయ్యారు. నితిన్ గడ్కరీ 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచి తిరిగి తన ఎంపీ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ప్రస్తుతం నితిన్ గడ్కరీ నాగ్‌పూర్ స్థానం నుండి ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నారు. సంఘ్‌కు బలమైన కోటగా ఉన్నప్పటికీ నాగ్‌పూర్‌లో బీజేపీ మూడు లోక్‌సభ ఎన్నికల్లో(1996,2014,2019) మాత్రమే విజయం సాధించగలిగింది. 

Election 2024

మరిన్ని వార్తలు