మీ దూకుడూ ...సాటెవ్వరు

31 Oct, 2023 04:17 IST|Sakshi

రాత్రికి రాత్రే పార్టీలు మారుతున్న అసంతృప్త నేతలు 

టికెట్లు ఆశించి భంగపాటుతో గతంలో తిట్టిన పార్టీల్లోకే వెళ్తున్న వైనం 

పార్టీలో ఉన్నప్పుడు ఒకలా.. పార్టీ మారగానే మరోలా విమర్శనాస్త్రాలు 

తాజాగా పోటీకి అధినేత నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్ష పదవికి కాసాని రాజీనామా 

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన రాజకీయ పార్టీల నుంచి వలసలు ఊపందుకున్నాయి. టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలంతా రాత్రికి రాత్రే పార్టీలు మారిపోతున్నారు. నిన్నటిదాకా తిట్టిపోసిన పార్టీల్లోనే దర్జాగా చేరుతూ తమను అక్కున చేర్చుకున్న పార్టీలను ఆకాశానికెత్తేస్తున్నారు. అదే సమయంలో నిన్నటిదాకా తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీలను దుమ్మెత్తిపోస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలోనూ ఇదే ట్రెండ్‌ కనిపిస్తోంది. 

రేఖా నాయక్, మైనంపల్లితో మొదలు... 
బీఆర్‌ఎస్‌ దాదాపు రెండున్నర నెలల కిందటే అభ్యర్థుల జాబితాను ప్రకటించగా అప్పట్లో ఒకరిద్దరు నేతలు మినహా మరెవరూ ఆ పార్టీని వీడలేదు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించడంతో ఆమె అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. ఎస్టీ మహిళనైన తనను పార్టీ బలిపశువు చేసిందని , మహిళలను గౌరవించని పార్టీలో కొనసాగలేనంటూ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ తాజా జాబితాలో రేఖానాయక్‌ భర్త శ్యాం నాయక్‌కు టికెట్‌ కేటాయించింది. మరో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు  రెండు టికెట్లు ఆశించి భంగపడటంతో ఏకంగా మంత్రి హరీశ్‌రావుపై తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరడమే కాకుండా తనకు, తన కుమారునికి టికెట్లు ఖాయం చేసుకున్నారు. 

రాజగోపాల్‌రెడ్డి యూటర్న్‌...: 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎన్నికైన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 2022లో ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఆ సందర్భంలో ఆయన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ను ఓడించే పార్టీ బీజేపీయేనని... అందుకే ఆ పార్టీలోకి చేరినట్లు ప్రకటించారు. మునుగోడు ఉపఎన్నిక తరుణంలో రేవంత్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డిని దూషించారు. అదే రాజగోపాల్‌రెడ్డి ఇప్పుడు తన అభిమానులు, కార్యకర్తలంతా కలసి బీఆర్‌ఎస్‌ను ఓడించడం ప్రస్తుత తరుణంలో కాంగ్రెస్‌కే సాధ్యమవుతుందని పేర్కొంటూ బీజేపీకి రాజీనామా చేసి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. కాంగ్రెస్‌లో చేరిన కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి మునుగోడు టికెట్‌ తెచ్చుకున్నారు. 

ఆల్‌ పార్టీ నేత నాగం...: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన సీనియర్‌ నేత నాగం జనార్దన్‌రెడ్డి ఒక్కప్పుడు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత వరుసగా పార్టీలు మారుతూ వస్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2011లో టీడీపీకి రాజీనామా చేశాక సొంత పార్టీ పెట్టిన ఆయన 2013లో బీజేపీలో చేరిపోయారు. 2018లో ఆ పార్టీ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్‌లో చేరారు. తాజాగా కాంగ్రెస్‌ ఆయనకు నాగర్‌కర్నూల్‌ టికెట్‌ నిరాకరించడంతో ఆ పార్టీని దుర్భాషలాడుతూ అధికార బీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో సీఎం కేసీఆర్‌ అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో ఏకంగా కోర్టుకెక్కిన నాగం... తాజాగా అదే కేసీఆర్‌ సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. 

మరికొందరిదీ అదే దారి... 

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ నేతలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికార పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన వెంటనే టికెట్లు పొందారు. మాజీ ఎమ్మెల్యే కేఎస్‌ రత్నం తనకు టికెట్‌ లభించే అవకాశం ఉన్న బీజేపీలో జాయిన్‌ అయ్యారు. జీహెచ్‌ఎంసీ బీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌గా నామినేట్‌ అయిన కార్పొరేటర్‌ జగదీశ్వర్‌గౌడ్, ఆయన సతీమణి బీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరగా ఆ వెంటనే ఆయనకు శేరిలింగంపల్లి టికెట్‌ లభించింది. 
  • రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్, బీఆర్‌ఎస్‌ నాయకునిగా ఉన్న మనోహర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఆయనకు తాండూరు టికెట్‌ లభించింది. 
  • బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి జంప్‌ కాగానే ఆయనకు కల్వకుర్తి సీటు ఖరారైంది. నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే వీరేశం కూడా బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ చేరగానే ఆయనకు టికెట్‌ కేటాయించిందా పార్టీ. 
  • నేరేడుచర్ల మున్సిపల్‌ వైస్‌–చైర్‌పర్సన్‌ శ్రీలతారెడ్డి బీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీలో చేరారు. ఆమెకు హుజూర్‌నగర్‌ టికెట్‌ దక్కే అవకాశం ఉంది. 

కొందరికి భవిష్యత్ పై హామీలు... 
కాంగ్రెస్, బీజేపీలో టికెట్ల రగడతో బీఆర్‌ఎస్‌లోకి సైతం భారీగానే మాజీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. అయితే వారికి ఇప్పటికిప్పుడు సీట్లు కేటాయించే అవకాశం లేకపోవడంతో భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామని అధికార పార్టీ హామీలు ఇస్తోంది.

ఇలా చేరిన వారిలో మాజీ ఎమ్మెల్యేలు/మంత్రులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఎ.చంద్రశేఖర్, ఎర్ర శేఖర్, గద్వాల డీసీసీ అధ్యక్షుడు పటేల్‌ ప్రభాకర్‌రెడ్డి, మెదక్‌ డీసీసీ అధక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, రాగిడి లక్ష్మారెడ్డి, నిర్మల్‌ బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి, పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, కొత్తగూడెం బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని తదితరులు ఉన్నారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు నిరాకరించడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ తాజాగా పదవికి రాజీనామా చేశారు. ఆయన బీఆర్‌ఎస్‌లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు