నామినేషన్లతో బాధితుల నిరసన.. 157 నామినేషన్లతో గజ్వేల్ సరికొత్త రికార్డు

11 Nov, 2023 21:06 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ ప్రక్రియ శుక్రవారంతోనే ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా 4,355 నామినేషన్లు దాఖలు అయ్యాయి. అయితే బీఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పోటీ చేస్తోన్న గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల నుంచే అత్యధిక నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌ 157 నామినేషన్లతో సరికొత్త రికార్డు సృష్టించింది. 

వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు బాధితులు సీఎం కేసీఆర్‌పై పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన వారిలో 100 మంది వట్టెనాగులపల్లి శంకర్ హిల్స్ ప్లాట్ బాధితులు ఉన్నారు. జగిత్యాల చెరుకు రైతులు కూడా పోటీ చేసేందుకు మొగ్గు చూపారు. ముత్యంపేట చెరుకు ఫ్యాక్టరీని తెరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల తరఫున కూడా పలువురు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎక్కువమంది ధరణి సహా వివిధ బాధితులు ఉన్నారు. నిరసన తెలిపే ఉద్దేశంలో భాగంగా వీరు నామినేషన్లు దాఖలు చేశారు.

గజ్వేల్ తర్వాత మేడ్చల్ నియోజకవర్గం నుంచి 125 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ఇక్కడ మంత్రి మల్లారెడ్డి పోటీ చేస్తున్నారు. మల్లారెడ్డిపై భూ కబ్జా ఆరోపణలు ఎక్కువగా ఉండటంతో బాధితులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. మూడోస్థానంలో కామారెడ్డి నియోజకవర్గానికి 102 నామినేషన్లు వచ్చాయి. ముఖ్యమంత్రి కెసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో కూడా అత్యధిక నామినేషన్లు రావడం గమనార్హం. ఆ తర్వాత.. మునుగోడు నుంచి 83, సూర్యాపేట నుంచి 81, మిర్యాలగూడ నుంచి 79, సిద్దిపేట నుంచి 76, నల్గొండ నుంచి 71, హుజూరాబాద్ నుంచి 70, కోదాడ నుంచి 66, రాజేంద్రనగర్ నుంచి 64, మల్కాజిగిరి నుంచి 60, ఎల్బీ నగర్ నుంచి 62, శేరిలింగంపల్లి నుంచి 58, సిరిసిల్ల నుంచి 42 నామినేషన్లు దాఖలయ్యాయి.

ఈసీ షెడ్యూల్‌ ప్రకారం.. నవంబర్‌ 10వ తేదీతో నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. నవంబర్‌ 13వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు 15వ తేదీ ఆఖరు. ఇప్పటిదాకా వంద మంది అఫిడవిట్లు లేకుండా నామినేషన్లు వేయడంతో ఎన్నికల సంఘం వాళ్లకు నోటీసులు జారీ చేసింది. అలాగే.. బీఫామ్‌ లేకుండా నామినేషన్లు వేసిన వాళ్లను స్వతంత్ర అభ్యర్థులుగా పరిగణించనుంది ఈసీ.  మొత్తం 119 నియోజకవర్గాల్లో ఈ నెల 30న పోలింగ్ ఉంది.   డిసెంబర్‌ 3వ తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. 

తెలంగాణ ఎన్నికల సమగ్ర కథనాల కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు