ట్రోలింగ్‌: ‘కరోనాకు కూడా మనలాగే జీవించే హక్కుంది’

14 May, 2021 14:07 IST|Sakshi

డెహ్రాడూన్: భారత్‌లో కరోనా రెండో దశ విరుచుకుపడుతోంది. మహమ్మారి కట్టడికి రాత్రి కర్ఫ్యూ, లాక్‌డౌన్‌ వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతోంది. మరోవైపు రికార్డ్‌ స్థాయిలో మరణాలు సంభవిస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది. కోవిడ్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా వైరస్ కూడా ఓ జీవిలాంటిదని, కరోనా కూడా మనలాగే జీవించే హక్కు ఉంటుందని పేర్కొన్నారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తున్నదని త్రివేంద్రసింగ్ వెల్లడించారు. 

ఒక తాత్విక కోణం నుంచి చూస్తే కరోనా వైరస్ కూడా ఒక జీవి. అందరిలాగా దానికి జీవించే హక్కు ఉంది. కానీ మనం (మనుషులు) దాని కంటే తెలివైనవాళ్లమనుకుంటాం. మనం దానిని నాశనం చేస్తున్నాం. అందుకే కరోనా వైరస్ నిరంతరం మారిపోతోంది’ అని త్రివేంద్ర సింగ్ రావత్ వింత వ్యాఖ్యలు చేశారు అయితే మానవులు సురక్షితంగా ఉండాలంటే వారు వైరస్‌ను అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు. కాగా త్రివేంద్ర సింగ్‌ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అవుతున్నాయి. దీంతో ఆయన ప్రకటనపై నెటిజన్లు ట్రోల్స్‌ చేస్తున్నారు.

ఓవైపు కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో ప్రజలు అష్టకష్టాలు పడుతుంటే ఇలాంటి మాటలేంటని పలువురు విమర్శలు చేస్తున్నారు. అంతేగాక ఈ వైరస్ సెంట్రల్ విస్టాలో ఆశ్రయం ఇవ్వాలని ఒక వినియోగదారు చురకలంటించాడు. కరోనాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా ఉండాలని నేషనల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ విమర్శించారు. మరోవైపు గత 24 గంటల్లో భారతదేశంలో 3,43,144 కొత్త కరోనా కేసులు నమోదవ్వగా.. 4,000  మంది ప్రాణాలు కోల్పోయారు.

చదవండి: 
వ్యాక్సిన్లతో పాటు ప్రధాని కూడా కనపడుట లేదు

'ఆ సమయంలో నా బిడ్డ ఎంత బాధ అనువించిందో'

మరిన్ని వార్తలు