రాజకీయ భిక్ష పెట్టిన జిల్లాకే అన్యాయం

2 Mar, 2024 03:19 IST|Sakshi

కేసీఆర్‌ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా ఒక్క ఎకరాకు నీరివ్వలేదు

ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి విమర్శ

ఉద్ధండాపూర్, కర్వెన రిజర్వాయర్ల సందర్శన 

దేవరకద్ర/జడ్చర్ల/కొందుర్గు: పాలమూరు– రంగారెడ్డి పథకాన్ని ఎండబెట్టారని, మేడిగడ్డను బొందపెట్టారని ఏఐసీసీ నేత వంశీచంద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన చలో పాలమూరు– రంగారెడ్డి రిజర్వాయర్ల సందర్శన చేపట్టారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి భూత్పూర్‌ మండలం కర్వెన, జడ్చర్ల మండలం ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్లను సందర్శించారు. రంగారెడ్డి జిల్లా జిల్లేడ్‌ చౌదరిగూడ మండలం లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని కూడా ఈ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా వంశీచంద్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు.

పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు వాస్తవ రూపం ప్రజలకు తెలియాలని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. 2015 లో శిలాఫలకం వేసిన పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కూర్చొని మూడేళ్లలో పూర్తి చేస్తానని గొప్పలు చెప్పిన కేసీఆర్‌.. రెండుసార్లు అధికారంలోకి వచ్చి నా ఒక్క ఎకరాకు నీరివ్వలేదని వంశీచంద్‌రెడ్డి విమర్శించారు. పాల మూరు జిల్లా ఎడారిగా మారుతున్నా పట్టించుకోలేదని, 2009లో ఎంపీగా గెలిపించి రాజకీయంగా భిక్ష పెట్టిన జిల్లాకే తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ప్రజలను మోసం చేయడానికి ఒక పంపును నామమాత్రంగా ప్రారంభించి పూర్తి చేశామని గొప్పలు చెప్పారని విమర్శించారు.

కర్వెన రిజర్వాయర్‌ ఇప్పటికీ అసంపూర్తి పనులతో అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రపంచంలోనే ఎనిమిదో వింతగా అభివర్ణించిన కాళేశ్వరంను బొంద పెట్టారన్నారు. కమీషన్ల కక్కుర్తితో మేడిగడ్డ పగుళ్లతో కుంగిపోవడానికి కారణం అయ్యారని ఆరోపించారు. షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులకు పిచ్చి పట్టిందని.. ఎర్రగడ్డకు వెళ్లాల్సిన నాయకులు, మేడిగడ్డకు వెళ్లారని ఎద్దేవా చేశారు. బృందంలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు జి.మధుసూదన్‌రెడ్డి, పరి్ణకారెడ్డి, అనిరుధ్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, ఈర్లపల్లి శంకర్, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు