అత్త వ్యూహం.. కోడలు విజయం

3 Dec, 2023 14:11 IST|Sakshi

పాలకుర్తి: ఓటమి ఎరుగని నేతగా పేరు తెచ్చుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముందునుంచి ఊహించినట్లే పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎర్రబెల్లిపై  కాంగ్రెస్‌ అభ్యర్థి యశస్విని రెడ్డి విజయం సాధించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడించేందుకు కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌తో ముందుకు వెళ్లింది. ఈ నేపథ్యంలో పాలకుర్తి  సీటు ఎంపికలో ఆ నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న హనుమాండ్ల ఝాన్సీరెడ్డి .. చివరి నిమిషంలో ఆమె కోడలు యశస్వినిని బరిలోకి దింపారు. 


అత్త వ్యూహం..  కోడలు విజయం
పాలకుర్తి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిగా హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి బరిలో దిగుతారని అందరూ ఆశించారు. అయితే. చివరి నిమిషంలో ఝాన్సీ భారత పౌరసత్వంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో ఝాన్సీరెడ్డి కుటుంబ సభ్యురాలైన యశస్వినినికే కాంగ్రెస్‌ టికెట్‌ కేటాయించింది. దీనిపై సర్వత్రా చర్చ కూడా జరిగింది. 

పాలకుర్తి నియోజకవర్గంలో తిరుగులేని ఎమ్మెల్యేగా రాణిస్తూ మంత్రిగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చెక్‌పెట్టేలా టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి అనూహ్యంగా ఎన్‌ఆర్‌ఐ ఝాన్సీలక్ష్మీరెడ్డిని రంగంలోకి దింపారు. ఇలాంటి తరుణంలోనే ఝాన్సీలక్ష్మీరెడ్డి భారత దేశ పౌరసత్వంపై వివాదం తలెత్తింది.  వారం రోజుల వరకూ తనకు పౌరసత్వం వస్తుందనీ, ఏలాంటి అపోహాలకు గురికావద్దన్న ఝాన్సీరెడ్డి ప్రత్యామ్నయంగా తన కోడలును ఎన్నికల సమరంలో దింపేందుకు రంగం సిద్ధం చేసుకుంది. 

వాస్తవానికి హనుమాంఢ్ల ఝాన్సీరెడ్డి పౌరసత్వం అడ్డోస్తే దేవరుప్పుల మండలం మాధాపురంకు చెందిన ప్రముఖవైద్యులు, టీపీసీసీ సభ్యులు డాక్టర్‌ లాకావత్‌ లక్ష్మీనారాయణనాయక్‌ రావడం అనివార్యంగా బావించారు. కానీ పాలకుర్తి నుంచి కాంగ్రెస్‌ జెండా ఎగురవేసే లక్ష్యంగా ఇక్కడి ప్రజలకు సేవ  చేసేందుకు వచ్చిన తన కుటుంబం తగ్గేదీలేదని ఎట్టకేలకు తన కోడలు యశస్వినికి రెండో విడతలో కాంగ్రెస్‌ టికెటు సాధించడంలో  సఫలీకృతమయ్యారు ఝాన్సీరెడ్డి,

అప్పటివరకూ తానొక్కతే ప్రచారంలో దూసుకపోతున్న క్రమంలో తోడుగా కోడలు రావడంతో కొంత పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొన్నప్పటీకీ డబుల్‌ ప్రచారంతో ప్రభుత్వ వ్యతిరేకతను కలిగిన ప్రజల్ని కూడగట్టుకొని చారిత్రాత్మక విజయం సాధించి ఝూన్సీరెడ్డి తనమార్కు నిలుపుకున్నారు. ఫలితంగా తొలిసారి పోటీ చేసి గెలుపును సొంతం చేసుకోవడంతో యశస్విని అరుదైన ఘనతసు సొంతం చేసుకున్నారు.

ఆది నుంచి ఎర్రబెల్లే టార్గెట్‌..
ఎర్రబెల్లిని కచ్చితంగా ఓడించాలనే వ్యూహంతో ఆది నుంచి పావులు కదిపిన కాంగ్రెస్‌ తన వ్యూహాన్ని కచ్చితంగా అమలు చేసింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది కాంగ్రెస్‌. యశస్విని కూడా తన ఎన్నికల ప్రచారంలో ఎర్రబెల్లిపై పదునైన విమర్శలు చేసి ఓటర్లను ఆకర్షించింది. దానికి తోడు కాంగ్రెస్‌ జోష్‌ కూడా తోడవడంతో ఆమె గెలుపు సునాయాసమైంది.

ఇక పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇప్పటికి మూడుసార్లు ప్రాతినిధ్యం వహించారు. .ఎర్రబెల్లికి ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. కానీ అది ఈసారి కలిసి రాలేదు. కాంగ్రెస్‌ జోరు ముందు ఎర్రబెల్లి పరాజయం చెందారు. 

మరొకవైపు బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన రామ్మోహన్‌రెడ్డ పెద్దగా ప్రభావం చూపలేదు. తొలి జాబితాలోనే సీటు దక్కించుకని ప్రచారాన్ని ఆదిలోనే ప్రారంభించినా ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం కాంగ్రెస్‌కే షిప్ట్‌ అయ్యింది. 

మరిన్ని వార్తలు