మంత్రి సబితారెడ్డికి పోటీగా బరిలో మేయర్‌ పారిజాత?

25 Sep, 2023 11:43 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డిజిల్లా: మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా బడంగ్‌పేట్‌ మేయర్‌ చిగురింత పారిజాత పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. నియోజకవర్గం నుంచి డీసీసీ అధ్యక్షుడు చల్లానర్సింహారెడ్డి సహా సీనియర్‌ నాయకులు దేప భాస్కర్‌రెడ్డి, కొత్త మనోహర్‌రెడ్డి తీవ్రంగా పోటీపడ్డారు. బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరిన కొత్త మనోహర్‌రెడ్డి ఇటీవల కర్ణాటక వెళ్లారు. డిప్యూటీ సీఎంతో పై రవీ చేయించారు.అయినా అధిష్టానం మాత్రం చిగురింతవైపే మొగ్గు చూపినట్లు సమాచారం. అభ్యర్థి పేరు అధికారికంగా ఇంకా వెల్లడించాల్సి ఉంది.

సర్పంచ్‌గా మొదలైన ప్రస్థానం
చిగురింత పారిజాత మొదట్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి సబితారెడ్డి ఆశీస్సులతో బడంగ్‌పేట్‌ మేయర్‌ పీఠాన్ని అధిష్టించారు. ఆమెకు గతంలో బాలాపూర్‌ సర్పంచ్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఆ తర్వాత కొద్ది రోజులకే అధికార బీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. అప్పటి నుంచి మంత్రికి పోటీగా బరిలో నిలిచేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఇటీవల తుక్కుగూడ వేదికగా నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభ ఏర్పాట్లు కూడా మేయర్‌ దంపతులే చూసుకున్నట్లు తెలిసింది. బడంగ్‌పేట్‌, మీర్‌పేట్‌, జల్‌పల్లి మున్సిపాలిటీల్లో వీరికి మంచి పట్టుంది.

మరిన్ని వార్తలు