నోటా (నన్‌ ఆఫ్‌ ది అబో) గురించి మీకు తెలుసా..!?

30 Oct, 2023 08:51 IST|Sakshi

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ప్రభావం ఎక్కువే..

ఎన్నికలు జరిగిన ప్రతిసారీ అధికమవుతున్న ‘నోటా‘ ఓట్ల సంఖ్య

సాక్షి, మెదక్‌: నోటా (NOTA) ఈ పదం ఎక్కువగా ఎన్నికల సమయంలో వినపడుతూ ఉంటుంది. ఈవీఎం మిషన్లపై చివరగా ఉండే ఈ నోటా గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారు కొందరు దీనిని ఉపయోగిస్తారు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి.. నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైన వారు ఒక్కరూ కనిపించడం లేదని అనుకునే వారి కోసం ఈ ‘నోటా’ మీటను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది.

ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత లేతదని గుర్తిస్తే ఈవీఎంలపై ఉన్న నోటా బటన్‌ను నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. దీనిని ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో నోటా బటన్‌ను నొక్కే వారి సంఖ్య ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూ వస్తుంది. నోటా (‘నన్‌ ఆఫ్‌ ది అబో) అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదని చెప్పేందుకు ఎన్నికల సంఘం దీనిని తీసుకొచ్చింది.

పోలింగ్‌ శాతం పెంచడం, ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నోటాను ఎంచుకున్నారు. నోటా ప్రభావం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఎంతలా అంటే.. పలుచోట్ల అభ్యర్థుల తలరాతను మార్చేంతలా ఉంది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువ.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేలకు పైగానే ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు.

సుప్రీం కోర్టు సూచనతో..
2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్‌ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్‌ 27న తీర్పును వెలువరించింది.

ఎప్పటి నుంచో ఉన్న తిరస్కరణ ఓటు..
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌ బూత్‌లోని ప్రిసైడింగ్‌ అధికారి దగ్గర దీనికోసం 17–ఏ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని తెలుపుతూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్‌ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్‌ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఎన్నికల సంఘం నోటాను అమలు చేసింది.

పెరుగుతున్న ఆదరణ..
2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో నోటాకు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు నోటా బటన్‌ను నొక్కేస్తున్నారు. 2014లో తొలిసారిగా నోటాను బ్యాలెట్‌ షీట్‌లో చేర్చారు.

ఆ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు 14,899 ఓట్లు పోలైతే, 2018లో 20,739 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. సిద్దిపేట నియోజవర్గంలో ఏడుగురు అభ్యర్థులకు, మెదక్‌లో 8 మంది, నారాయణఖేడ్‌లో 6, అందోల్‌లో 5, నర్సాపూర్‌లో 3, జహీరాబాద్‌లో 10, సంగారెడ్డిలో 10, పటాన్‌చెరులో 11, దుబ్బాకలో 11, గజ్వేల్‌లో 9, హుస్నాబాద్‌ నియోజకవర్గంలో 11 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి.
ఇవి చదవండి: 'కార్యకర్తలను కాపాడుకుంటా..' : మంత్రి హరీశ్‌రావు

మరిన్ని వార్తలు