Ind vs Eng: అలాంటి పిచ్‌లు అవసరమా అన్న గంగూలీ.. ద్రవిడ్‌ కౌంటర్‌!

6 Feb, 2024 16:01 IST|Sakshi
ద్రవిడ్‌- గంగూలీ (PC: BCCI)

Ind vs Eng- Dravid Comments On Pitch: ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్‌లు ఐదురోజుల పాటు పూర్తిగా జరిగిన సందర్భాలు అరుదు. ఒక్కోసారి ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్‌లు ముగిసిపోవడం వల్ల పిచ్‌ల తయారీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో టీమిండియా- ఇంగ్లండ్‌ తాజా సిరీస్‌పై క్రికెట్‌ దిగ్గజాల దృష్టి పడింది. భారత్‌ వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన గత సిరీస్‌లో పిచ్‌పై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ సహా ఇతర మాజీ క్రికెటర్లు వ్యంగ్యస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే.

ఆతిథ్య జట్టుకు మాత్రమే ఉపయోగపడేలా వికెట్‌ రూపొందించారంటూ విమర్శించారు. ఈ క్రమంలో తాజా సిరీస్‌లో ఇప్పటి వరకు జరిగిన రెండు మ్యాచ్‌లు నాలుగు రోజుల పాటు సాగాయి.

బుమ్రా అద్భుత ప్రదర్శన
హైదరాబాద్‌ టెస్టులో విజయంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ ఆరంభిస్తే... విశాఖపట్నంలో టీమిండియా గెలుపొంది సిరీస్‌ను 1-1తో సమం చేసింది. రెండు మ్యాచ్‌లు కూడా రసవత్తరంగానే సాగడం విశేషం. ముఖ్యంగా టీమిండియా పేస్‌ దళ నాయకుడు జస్‌ప్రీత్‌ బుమ్రా వికెట్లు తీసిన తీరు ముచ్చటగొలిపింది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ స్పందిస్తూ.. భారత్‌లో స్పిన్‌తో పాటు పేస్‌కూ అనుకూలించే పిచ్‌లు రూపొందించాలని విజ్ఞప్తి చేశాడు. కేవలం టర్న్‌ అయ్యే పిచ్‌లు మనకు అవసరమా అని ఈ సందర్భంగా కామెంట్‌ చేశాడు. ఈ క్రమంలో..  తాజాగా ఈ విషయంపై టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సైతం స్పందించాడు.

విశాఖ మ్యాచ్‌లో భారత్‌ గెలుపు నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. తామెప్పుడూ పూర్తి స్పిన్‌ పిచ్‌ తయారు చేయాలని కోరలేదని స్పష్టం చేశాడు. పిచ్‌ల రూపకల్పన క్యూరేటర్ల పని అని.. అందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాడు.

 టర్న్‌ అయ్యే పిచ్‌లే కావాలని మేము కోరలేదు
‘‘పిచ్‌లను క్యూరేటర్‌ తయారు చేస్తారు. పూర్తిగా టర్నింగ్‌ పిచ్‌లు మాత్రమే కావాలని మేము అడగము. ఇండియాలో సహజంగానే వికెట్లు స్పిన్‌కు అనుకూలిస్తాయి.  అయితే, అవి ఎంత వరకు టర్న్‌ అవుతాయి? ఎంత తక్కువ టర్న్‌ అవుతాయి? అన్న విషయాలు మనకు తెలియవు.

నేనేమీ పిచ్‌ నిపుణుడిని కాదు. ఇండియాలో పిచ్‌లు నాలుగు- ఐదు రోజుల ఆట కోసమే రూపొందిస్తారు. మళ్లీ చెప్తున్నా ఇక్కడి పిచ్‌లు టర్న్‌ అవుతాయి. అంతేగానీ.. టర్న్‌ అవుతూనే ఉండవు.

ఒక్కోసారి మూడో రోజు.. ఒక్కోసారి నాలుగో రోజు.. ఒక్కో సారి రెండోరోజే టర్న్‌ అవుతాయి. పిచ్‌ స్వభావం ఎలా ఉండబోతుందన్న అంశంపై ఎవరికీ పూర్తి అవగాహన ఉండదు. ఏ పిచ్‌పై అయినా మా ఆట తీరు ఎలా ఉంటుందనేదే ముఖ్యం. 

తదుపరి మేము రాజ్‌కోట్‌కు వెళ్తున్నాం. అక్కడి పిచ్‌ ఎలా ఉంటుందో మాకు ఐడియా లేదు. ఎలాంటి వికెట్‌పై అయినా మా అత్యుత్తమ ప్రదర్శన కనబరచడమే మాకు ప్రథమ ప్రాధాన్యం’’ అని రాహుల్‌ ద్రవిడ్‌ కుండబద్దలు కొట్టాడు. 

గంగూలీకి కౌంటర్‌గానేనా?
ఈ వ్యాఖ్యలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్న నెటిజన్లు.. గంగూలీ లాంటి వాళ్లకు ద్రవిడ్‌ గట్టిగానే కౌంటర్‌ ఇచ్చాడంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే తన సహచర ఆటగాడు ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ఆరంభం కానుంది. 

చదవండి: IPL 2024: అందుకే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తప్పించాం.. కోచ్‌పై రితిక ఫైర్‌

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega