CWC 2023: అందరూ హీరోలే.. కానీ చివరకు ఇలా! అద్భుతం నుంచి ఆవేదన వరకు..

20 Nov, 2023 03:47 IST|Sakshi

ప్రపంచకప్‌లో భారత్‌కు మరోసారి నిరాశ

తుది మెట్టుపై తడబాటు

మ­ళ్లీ అదే బాధ... మరోసారి అదే వేదన... చేరువై దూరమైన వ్యథ! తమ అద్భుత ఆటతో అంచనాలను పెంచి విశ్వ విజేతగా నిలిచేందుకు అన్ని అర్హతలు ఉన్న జట్టుగా కనిపించిన భారత్‌ విషాదంగా మెగా టోర్నీని ముగించింది. 2003లో ఆసీస్‌ చేతిలో ఓడిన బాధ నాటి తరానికి మాత్రమే గుర్తుంటుంది... కానీ నాలుగేళ్ల క్రితం 2019 సెమీఫైనల్లో మన ఓటమి ఇంకా అభిమానుల మదిలో తాజాగానే ఉంది. ఇప్పుడు స్వదేశంలో దానిని సరిదిద్దుకునే అవకాశం లభించింది.

తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై మన ఆధిపత్యం చూస్తే భారత జట్టుపై అంచనాలు పెరిగాయి... ప్రపంచకప్‌నకు ఆరు నెలల ముందు నుంచి జట్టు కూర్పుపై ప్రణాళికలు, ప్రదర్శన, ఒక్కో ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనలు, వారికి అప్పగించిన వేర్వేరు బాధ్యతలు అద్భుతంగా పని చేశాయి. కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్, రోహిత్‌ కెప్టెన్సీ మధ్య గొప్ప సమన్వయం మెరుగైన వ్యూహాలకు బాట వేసింది. ఈ నాలుగేళ్ల కాలంలో 66 వన్డేల్లో కలిపి భారత్‌ 50 మంది ఆటగాళ్లను ఆడించింది. ఏ ఇతర జట్టూ ఇంత మందికి అవకాశం కల్పించలేదు.

ముఖ్యంగా ప్రతీ స్థానం కోసం సరిగ్గా సరిపోయే ఆటగాళ్లను గుర్తించే ప్రయత్నం ఇందులో జరిగింది. ఆయా ఆటగాళ్ల ప్రదర్శన తర్వాత ఈ సంఖ్యను సగానికి తగ్గించి 24 మందితో ఒక జాబితా తయారైంది. ఇందులో నుంచే వరల్డ్‌కప్‌ కప్‌ టీమ్‌ ఉంటుందనే విషయంపై స్పష్టత వచ్చింది.

వరల్డ్‌కప్‌నకు ఆరు నెలల ముందునుంచి చూస్తే 2023 మార్చి 1 నుంచి అక్టోబర్‌ 4 మధ్య భారత్‌ 15 వన్డేలు ఆడితే ఈ 24 నుంచే జట్లను ఎంపిక చేశారు. అనంతరం 15 మందితో వరల్డ్‌ కప్‌ టీమ్‌ ఎంపికైంది. వరుస అద్భుత విజయాలు వీరితోనే సాధ్యమయ్యాయి.  

‘మేం జట్టుగా గెలుస్తాం...జట్టుగా ఓడతాం’... ప్రపంచకప్‌ మొత్తం భారత డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ నినాదం గట్టిగా మార్మోగింది. సెమీస్‌ వరకు ఒక్కసారి కూడా ఓటమిని దరి చేరనీయకుండా విజయంపై విజయంపై సాధిస్తూనే టీమిండియా తమ స్థాయిని ప్రదర్శించింది. ఎదురులేని ఆటతో వరుసగా 10 మ్యాచ్‌లను సొంతం చేసుకొని అంచనాలను ఆకాశానికి పెంచింది.

1983 వరల్డ్‌కప్‌ అనగానే జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ 175 నాటౌట్, ఫైనల్లో కపిల్‌ పట్టిన రిచర్డ్స్‌ క్యాచ్‌లాంటివి ప్రత్యేకంగా కనపడతాయి. 2011లో యువరాజ్‌ సింగ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో పాటు ధోని కొట్టిన విన్నింగ్‌ సిక్సరే అందరి మనసుల్లో ముద్రించుకుపోయింది.

ఈ రెండు మెగా టోర్నీల్లోనూ ఇతర ఆటగాళ్లూ తమ వంతు పాత్ర పోషించినా... టీమ్‌ గేమ్‌లో గెలవాలంటే అందరి భాగస్వామ్యం తప్పనిసరి అని ఎన్ని మాటలు చెప్పుకున్నా కొన్ని వ్యక్తిగత ప్రదర్శనలే హైలైట్‌ అయి అవే ప్రపంచకప్‌ను గెలిపించాయనే భావన కలిగిస్తాయి.

కానీ ఈ టోర్నీలో మాత్రం భారత ఆటగాళ్లందరూ హీరోలే. ఒకరు ఎక్కువా కాదు, ఒకరు తక్కువా కాదు. మైదానంలోకి దిగిన ప్రతీ ఒక్కరు తమదైన ఆటతో జట్టును గెలిపించారు... జట్టు కోసం గెలుపు అవకాశాలు సృష్టించారు.

జట్టుకు విజయం అందించేందుకు ఒకటో నంబర్‌ ఆటగాడినుంచి పదకొండో నంబర్‌ ప్లేయర్‌ వరకు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు. వ్యక్తిగతంగా చూస్తే ప్రతీ పోరులో ఒకరు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలుస్తారు. కానీ భారత జట్టుకు సంబంధించి ప్రతీ మ్యాచ్‌లో అందరూ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌లే.

ఒక బ్యాటర్‌ నెమ్మదించినట్లు కనిపిస్తే మరొకరు చెలరేగిపోయారు. ఒక బౌలర్‌ కాస్త తడబడినట్లు అనిపిస్తే నేనున్నానంటూ మరో బౌలర్‌ వచ్చి లెక్క సరిచేశారు. పవర్‌ప్లేలో పవర్‌ అంతా చూపిస్తే, మధ్య ఓవర్లలో మరొకరు ఇన్నింగ్స్‌ నడిపించారు.

చివర్లో చెలరేగే బాధ్యత ఇంకొకరిది. భారత గడ్డపై పేసర్లు ఇంతగా ప్రభావం చూపించగలరని ఎవరైనా అనుకున్నారా! మన త్రయం దానిని చేసి చూపించింది. ఒక్కో బంతిని ఆడేందుకు బ్యాటర్లు పడిన తిప్పలు చూస్తే దాని పదునేమిటో తెలుస్తుంది. ఇక స్పిన్‌ ద్వయం ప్రత్యర్థులను పూర్తిగా కట్టి పడేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఐదుగురూ వికెట్లు తీయగల సమర్థులైన బౌలర్లు ఉన్న టీమిండియాను చూసి ఎన్నాళ్లయింది?  

అంకెలపరంగా చూస్తే ప్రతీ ఒక్కరి పాత్ర జట్టును గెలిపించింది. 11 ఇన్నింగ్స్‌లలో 3 సెంచరీలు, 6 అర్ధసెంచరీలతో 765 పరుగులు చేసిన కోహ్లి తన విలువేంటో చూపించాడు. ముందుగా క్రీజ్‌లో కుదురుకొని తర్వాత ధాటిగా ఆడే తన శైలిని మార్చుకొని ఆరంభంలో చెలరేగి విజయానికి పునాది వేసే వ్యూహంతోనే ఆడిన కెప్టెన్‌ రోహిత్‌ కూడా 597 పరుగులు చేశాడు. శ్రేయస్‌ (530), రాహుల్‌ (452), శుబ్‌మన్‌ గిల్‌ (354) కూడా కీలక పరుగులు సాధించారు.

ఇక బౌలింగ్‌లో 7 మ్యాచ్‌లలోనే కేవలం 10.70 సగటుతో 24 వికెట్లు తీసి మొహమ్మద్‌ షమీ టోర్నీని ఒక ఊపు ఊపాడు. బుమ్రా 20 వికెట్లతో తన సత్తాను చాటగా... జడేజా (16), కుల్దీప్‌ (15), సిరాజ్‌ (14) బౌలింగ్‌ దళం బలాన్ని చూపించారు.  

కానీ... కానీ... ఫైనలో పోరులో మాత్రం ఈ గణాంకాలన్నీ పనికి రాలేదు. సెమీస్‌ వరకు స్వేచ్ఛగా ఆడినా... వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఆడుతున్న ఒత్తిడి సహజంగానే వారిలో కనిపించింది. అందుకే అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌ ఏదీ కలిసి రాలేదు. గిల్, శ్రేయస్‌ జోరు చూపించలేకపోగా, రాహుల్‌ పూర్తిగా తడబడ్డాడు. ఫైనల్‌లాంటి కీలక పోరులో రోహిత్‌ తన దూకుడు కాస్త నియంత్రించుకొని ఉంటే బాగుండేదని అనిపించినా... అతనూ విఫలమయ్యే ప్రమాదమూ ఉండేది.

కోహ్లి ఒక్కడే తన స్థాయికి తగ్గ ఆటను చూపించగలిగినా అది సరిపోలేదు. జడేజా, సూర్య ఇలాంటి సమయంలో ఆదుకోలేకపోయారు. అయితే బౌలింగ్‌ దళం కాస్త ఆశలు కలిగించింది. ఆరంభంలో మూడు వికెట్లు తీయడం కూడా నమ్మకం పెంచింది. అయితే 240 పరుగుల స్కోరు మరీ చిన్నదైపోయింది. పది విజయాల ప్రదర్శన తర్వాత ఇలాంటి ఆట ఓటమి వైపు నిలిపింది.  

అయినా సరే... భారత్‌ ప్రదర్శనను తక్కువ చేయలేం. లీగ్‌ దశలో తొమ్మిది వేర్వేరు ప్రత్యర్థులతో, వేర్వేరు వేదికలపై సాగించిన ఆధిపత్యం అసాధారణం. ఆటగాళ్ల శ్రమ, అంకితభావం అన్నింటిలో కనిపించాయి. ఈ టీమ్‌ చాంపియన్‌గా నిలిచేందుకే పుట్టింది అని అనిపించింది.

అయితే ఏదైనా తప్పు జరగాలని రాసి పెట్టి ఉంటే అది ఎలాగూ జరుగుతుంది. కానీ కీలక సమయంలోనే అది జరుగుతుంది. ఈ టోర్నీలో మనం ఒక్క మ్యాచ్‌ అయినా ఓడాలని రాసి పెట్టి ఉన్నట్లుంది. ఆ మ్యాచ్‌ కాస్తా ఫైనల్‌ మ్యాచ్‌ కావడమే విషాదం!  
–సాక్షి క్రీడా విభాగం 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు