చాలా బాధగా ఉంది.. మేము కొన్ని తప్పులు చేశాం: బాబర్‌ ఆజం

12 Nov, 2023 08:53 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023ను పాకిస్తాన్‌ ఓటమితో ముగించింది. ఈ మెగా టోర్నీలో భాగంగా కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ పరాజయం పాలైంది. దీంతో సెమీస్‌ రేసు నుంచి పాకిస్తాన్‌ అధికారికంగా నిష్క్రమించింది. 338 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 44.3 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌటైంది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో డేవిడ్‌ విల్లీ మూడు వికెట్లతో అదరగొట్టగా.. గుస్ అట్కిన్సన్, అదిల్‌ రషీద్‌, మొయిన్ అలీ తలా రెండు వికెట్లు సాధించారు. పాకిస్తాన్‌ బ్యాటర్లలో అఘా సల్మాన్‌(51) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా ఈ వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌కు ఇది ఐదో ఓటమి. వన్డే ప్రపంచకప్‌ల చరిత్రలో ఒక టోర్నీలో పాక్‌ 5 మ్యాచ్‌ల్లో ఓటమి పాలవడం ఇదే మొదటిసారి. ఇక ఓటమిపై మ్యాచ్‌ అనంతరం పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం స్పందించాడు.

"ఈ మ్యాచ్‌లో మా ప్రదర్శన చాలా నిరాశపరిచింది. మేము దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచినట్లయితే.. పరిస్థితి మరో విధంగా ఉండేది.  బౌలింగ్‌, ‍బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో తప్పిదాలు చేశాం. 20-30 పరుగులు అదనంగా ఇచ్చాం. మా స్పిన్నర్లు వికెట్లు తీయలేదు. అది మాపై పెద్ద ప్రభావాన్ని చూపింది.

మిడిల్ ఓవర్‌లో స్పిన్నర్లు వికెట్లు తీయకపోతే ఏ జట్టుకైనా గెలవడం చాలా కష్టం. ఈ టోర్నీలో మేము చేసిన తప్పిదాలను కచ్చితంగా చర్చిస్తాం. తప్పులతో పాటు కొన్ని సానుకూలాంశాలు కూడా ఉన్నాయి. జట్టుకు సారథిగా ఎల్లప్పుడూ 100 శాతం ఎఫెక్ట్‌ పెడతాను" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో బాబర్‌ పేర్కొన్నాడు.
చదవండిWorld Cup 2023: నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌.. బుమ్రా దూరం! జట్టులోకి యువ బౌలర్‌

మరిన్ని వార్తలు