Asia Cup: ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు.. అయినా: రవిశాస్త్రిని ఏకిపారేసిన గంభీర్‌!

22 Aug, 2023 19:06 IST|Sakshi
గౌతం గంభీర్‌- రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా

Absolutely rubbish: Gautam Gambhir: మెగా టోర్నీలలో భారత తుది జట్టులో ముగ్గురు లెఫ్లాండర్లు ఉండాలన్న ఆలోచనను టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ కొట్టిపారేశాడు. ఇంతకంటే చెత్త సలహా మరొకటి లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. బ్యాటర్‌ది ఎడమచేతి వాటమా, కుడిచేతి వాటమా అన్న అంశంతో సంబంధం లేదని.. అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న వాళ్లనే ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించాడు.

కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉండాలన్న రవిశాస్త్రి
కాగా ఆసియా కప్‌-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి జట్టు కూర్పు గురించి తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ‘‘తుది జట్టులో కనీసం ముగ్గురు లెఫ్టాండర్లు ఉంటే బాగుంటుంది. గత ఎనిమిది నెలలుగా ఇషాన్‌ కిషన్‌ ఆట తీరును గమనించండి.

బ్యాటింగ్‌ చేయడంతో పాటు అతడు వికెట్‌ కీపింగ్‌ కూడా చేస్తున్నాడు. అతడితో పాటు మరో ఇద్దరు.. జడ్డూను కూడా కలిపితే టాప్‌-7లో మొత్తం ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు అవుతారు’’ అని పేర్కొన్నాడు. జట్టుకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో చెప్పుకొచ్చాడు.


ఇషాన్‌ కిషన్‌

ఇంతకంటే చెత్త ఆలోచన మరొకటి లేదు
అయితే, రవిశాస్త్రి ఐడియాపై పరోక్షంగా స్పందించిన గంభీర్‌.. ‘‘ఆటగాడు లెఫ్టాండరా లేదంటే రైట్‌ హ్యాండరా అన్న దానితో పనిలేదు. జట్టులో ముగ్గురు ఎడమచేతి వాటం బ్యాటర్లు ఉండాలన్నది చెత్త ఆలోచన. 

జట్టులో ఎందరు లెఫ్టాండర్లు ఉండాలన్నది ముఖ్యం కాదు. ఎవరు ఎలా ఆడుతున్నారు? అతడు జట్టుకు ఉపయోగపడతాడా? అన్నదే చూడాలి. పరిస్థితులకు అనుకూలంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేవాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆటగాళ్లకు అదే ముఖ్యం
ప్లేయర్లు ఫామ్‌లో ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. అంతేకానీ.. సరిగ్గా ఆడకపోయినా సరే లెఫ్టాండర్లకు చోటివ్వాలి కాబట్టి సెలక్ట్‌ చేయాలనడం తప్పు’’ అని పేర్కొన్నాడు. రవిశాస్త్రికి దిమ్మతిరిగేలా ఈ మేరకు గౌతీ కౌంటర్‌ ఇచ్చాడు.


సహచర ఆటగాళ్ల అభినందనల నడుమ తిలక్‌ వర్మ

కాగా ఆసియా కప్‌-2023 నేపథ్యంలో బీసీసీఐ సోమవారం జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురు లెఫ్టాండర్లు రవీంద్ర జడేజా, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మకు చోటు దక్కింది. ఇదిలా ఉంటే.. ఆగష్టు 30 నుంచి ఆసియా కప్‌ టోర్నీ ఆరంభం కానుంది. ఈ వన్డే ఈవెంట్‌కు పాకిస్తాన్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్నాయి. 

వీళ్ల నుంచే వరల్డ్‌కప్‌నకు
ఇక అక్టోబరు 5 నుంచి భారత్‌ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌-2023 నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్‌ జట్టు జాబితా నుంచే ప్రపంచకప్‌నకు ఆటగాళ్లను ఎంపిక చేస్తామని బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ స్పష్టం చేశాడు.

ఈ నేపథ్యంలో తుది జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. కాగా 2011 వరల్డ్‌కప్‌ గెలిచిన జట్టులో గౌతం గంభీర్‌ సభ్యుడన్న విషయం తెలిసిందే!

ఆసియా వన్డే కప్‌-2023- భారత జట్టు:
రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, కుల్దీప్‌ యాదవ్‌, ప్రసిద్‌ కృష్ణ.

స్టాండ్‌ బై: సంజూ శాంసన్‌.
చదవండి: సచిన్‌ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు! ఇకపై..
వరల్డ్‌కప్‌ జట్టులో రోహిత్‌ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్‌..
అందుకే తిలక్‌ను సెలక్ట్‌ చేశాం.. వరల్డ్‌ కప్‌ టీమ్‌లో: బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌

మరిన్ని వార్తలు