విజేత జట్ల కెప్టెన్లకు ఆహ్వానం.. ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం! ఘనంగా ముగింపు వేడుకలు

18 Nov, 2023 14:07 IST|Sakshi

ICC CWC 2023 Closing Ceremony: వన్డే వరల్డ్‌కప్‌-2023 టోర్నీకి భారత క్రికెట్‌ నియంత్రణ మండలి ఘనంగా ముగింపు పలకనుంది. ఇందుకోసం.. అహ్మదాబాద్‌లో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. కాగా టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య ఆదివారం టైటిల్‌ పోరు జరుగనున్న విషయం తెలిసిందే.

ఎయిర్‌ షోతో మొదలు
ఈ క్రమంలో మధ్యాహ్నం 1:35 నిమిషాల నుంచి 1:50 నిమిషాల వరకు.. భారత వైమానిక దళానికి చెందిన సూర్యకిరణ్‌ ఏరోబాటిక్‌ టీమ్‌ ఎయిర్‌ షోతో అలరించనుంది. ఇన్నింగ్స్‌ ఆరంభమైన తర్వాత మొదటి డ్రింక్స్‌ బ్రేక్‌లో ప్రముఖ గాయకుడు, పాటల రచయిత ఆదిత్య గాధ్వి సంగీత కార్యక్రమం నిర్వహించనున్నారు. 

జోనితా గాంధీ, అజీజ్‌ తదితరులతో
ఇక మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌ విరామ సమయంలో మ్యుజీషియన్‌ ప్రీతం చక్రవర్తి, గాయకులు జోనితా గాంధీ, నకాష్‌ అజీజ్‌, అమిత్‌ మిశ్రా, ఆకాశ సింగ్‌, తుషార్‌ జోషీ తమ గాత్రంతో అలరించనున్నారు.

అదే విధంగా మ్యాచ్‌ ముగిసిన తర్వాత ప్రత్యేక లేజర్‌ లైట్‌ షో నిర్వహించనున్నారు. ఈ మేరకు ముగింపు వేడుకలకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ శనివారం విడుదల చేసింది.  

కాగా ప్రపంచంలోని క్రికెట్‌ మైదానాల్లో పెద్దదైన నరేంద్ర మోదీ స్టేడియంలో నవంబరు 19న టీమిండియా- ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే ఐదుసార్లు చాంపియన్‌ అయిన కంగారూ జట్టు.. సొంతగడ్డపై దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత జట్టును ఓడించడం కష్టమే అనే అభిప్రాయాలే ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి.

విజేత జట్ల కెప్టెన్లకు ఆహ్వానం 
ఇప్పటి వరకు జరిగిన 12 వన్డే ప్రపంచకప్‌ టోర్నీ లలో విజేత జట్లకు కెప్టెన్‌లకు వ్యవహరించిన వారికి ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) ఆహ్వానించనుంది.

క్లయివ్‌ లాయిడ్‌ (వెస్టిండీస్‌; 1975, 1979), కపిల్‌ దేవ్‌ (భారత్‌; 1983), అలెన్‌ బోర్డర్‌ (ఆస్ట్రేలియా; 1987), ఇమ్రాన్‌ ఖాన్‌ (పాకిస్తాన్‌; 1992), అర్జున రణతుంగ (శ్రీలంక; 1996), స్టీవ్‌ వా (ఆస్ట్రేలియా; 1999), రికీ పాంటింగ్‌ (ఆస్ట్రేలియా; 2003, 2007), ధోని (భారత్‌; 2011), మైకేల్‌ క్లార్క్‌ (ఆస్ట్రేలియా; 2015), ఇయాన్‌ మోర్గాన్‌ (ఇంగ్లండ్‌; 2019) ఈ జాబితాలో ఉన్నారు. 

కాగా జైలులో ఉన్న పాక్‌ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ఈ ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశమే లేదు. తెర వెనుక నుంచి శ్రీలంక క్రికెట్‌ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని బీసీసీఐ కార్యదర్శి జై షాపై విమర్శలు గుప్పించిన శ్రీలంక మాజీ సారథి అర్జున రణతుంగ కూడా ఫైనల్‌కు రావడం అనుమానమే. 

మ్యాచ్‌కు భారత ప్రధాని, ఆసీస్‌ ఉప ప్రధాని 
ఫైనల్‌ను చూసేందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్‌ మార్లెస్‌ విచ్చేయనున్నారు. వీరితో పాటు బడా పారిశ్రామిక దిగ్గజాలు, పలు రంగాలకు చెందిన దిగ్గజాలు, భారతీయ సినీ రంగ ప్రముఖులంతా హాజరు కానున్న నేపథ్యంలో గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ శుక్రవారం గాందీనగర్‌లో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ప్రధాని చేతుల మీదుగా ట్రోఫీ ప్రదానం
భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. అతిరథ మహారథులతో పాటు సాధారణ ప్రేక్షకులకు అసౌకర్యం లేకుండా చూడాలని కోరారు. విశ్వవిజేతగా నిలిచే జట్టుకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ట్రోఫీని అందజేసే అవకాశముంది. 

చదవండి: CWC 2023: ఆ ఇద్దరూ టీమిండియా పాలిట వరం.. అంచనాలకు మించి! 

మరిన్ని వార్తలు