CWC 2023: అన్నంత పనిచేసిన కమిన్స్‌.. టీమిండియా అభిమానుల హృదయాలు ముక్కలు

19 Nov, 2023 21:30 IST|Sakshi

ఆస్ట్రేలియా వంటి ప్రమాదకరమైన జట్టుతో జాగ్రత్త.. డేంజరస్‌ టీమ్‌.. ఫైనల్‌కు వచ్చిందంటే కప్‌ ఎగురేసుకుపోకుండా ఉండదు.. వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌కు ముందు టీమిండియాకు మాజీ క్రికెటర్లు జారీ చేసిన హెచ్చరికలు.. ఇప్పుడు ఆ మాటలే నిజమయ్యాయి.

స్టేడియంలో లక్ష మందికిపైగా టీమిండియా అభిమానుల మధ్య రోహిత్‌ సేనపై అలవోకగా విజయం సాధించింది కంగారూ జట్టు. రికార్డు స్థాయిలో ఏకంగా ఆరోసారి వన్డే ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

భారత జట్టుకు మద్దతుగా నరేంద్ర మోదీ స్టేడియం మొత్తం హోరెత్తుతుందని తెలుసు.. వాళ్లందరినీ నిశ్శబ్దంగా ఉంచడమే లక్ష్యం.. అంతకంటే సంతృప్తి మరొకటి ఉండదు.. అన్నట్లుగానే కోట్లాది మంది టీమిండియా అభిమానుల హృదయాలను ముక్కలు చేశాడు ఆసీస్‌ సారథి ప్యాట్‌ కమిన్స్‌. 

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోవడం మొదలు.. పదే పదే బౌలర్లను మారుస్తూ భారత బ్యాటర్లను కట్టడి చేసిన విధానం.. ఆపై లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే భారత బౌలర్లపై ఒత్తిడి పెంచేలా వ్యూహాలు రచించిన తీరు అద్భుతం. మ్యాచ్‌ ఆసాంతం పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిన విధానం కమిన్స్‌ నాయకత్వ ప్రతిభకు అద్దంపట్టాయి. ఆసీస్‌కు వరల్డ్‌కప్‌ అందించిన దిగ్గజ కెప్టెన్ల సరసన నిలిపాయి.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుని
క్రికెట్‌ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసిన ప్రపంచకప్‌-2023 ఫైనల్‌ ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన తుదిపోరులో ఆతిథ్య టీమిండియాను ఓడించిన ఆస్ట్రేలియా చాంపియన్‌గా అవతరించింది. మోదీ స్టేడియంలో టాస్‌ గెలిచిన ప్యాట్‌ కమిన్స్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. 

గిల్‌, అయ్యర్‌ పూర్తిగా విఫలం
ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఆది నుంచే దూకుడుగా ఆడుతూ 31 బంతుల్లో 47 పరుగులు సాధించాడు. అయితే, మరో ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ మాత్రం పూర్తిగా తేలిపోయాడు.

మొత్తంగా ఏడు బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్‌ 4 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విరాట్‌ కోహ్లి, 54 పరుగులతో రాణించగా.. నాలుగో నంబర్‌ బ్యాటర్‌, గత మ్యాచ్‌లలో వరుసగా సెంచరీలు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌ కీలక మ్యాచ్‌లో మాత్రం 4 పరుగులకే నిష్క్రమించాడు.
 
రాహుల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌
ఈ క్రమంలో రాహుల్‌ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. 107 బంతులు ఎదుర్కొని 66 పరుగులు సాధించి టీమిండియా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా వాళ్లలో సూర్యకుమార్‌ యాదవ్‌ (18), కుల్దీప్‌ యాదవ్‌(10) మాత్రమే డబుల్‌ డిజిట్‌ స్కోర్లు చేయగలిగారు.

ఆసీస్‌ బౌలర్లలో పేసర్లు మిచెల్‌ స్టార్క్‌ మూడు వికెట్లు దక్కించుకోగా.. హాజిల్‌వుడ్‌, కమిన్స్‌ తలా రెండు వికెట్లు తీశారు. స్పిన్నర్లు మాక్స్‌వెల్‌, జంపా చెరో వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

హెడ్‌ అద్భుత సెంచరీ
ఇక స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆరంభంలో టీమిండియా కట్టడి చేయగలిగింది. ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌(7)ను షమీ పెవిలియన్‌కు చేర్చగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌(15)ను బుమ్రా అవుట్‌ చేశాడు.

ఆరోసారి జగజ్జేతగా ఆస్ట్రేలియా
కానీ మరో ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను టీమిండియా నుంచి లాగేసుకున్నాడు. అద్భుత శతకం(120 బంతుల్లో 137 పరుగులు)తో రాణించి ఆరోసారి ఆస్ట్రేలియా విశ్వవిజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.

ఇక అతడి తోడుగా మార్నస్‌ లబుషేన్‌ 58 పరుగులతో అజేయంగా నిలవగా.. మాక్స్‌వెల్‌ రెండు పరుగులు తీసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. దీంతో 43 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించిన కంగారూ జట్టు 6 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఆశగా ఎదురుచూసిన టీమిండియా అభిమానులకు కోలుకోలేని షాకిచ్చింది. 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు