IND VS ENG: 48 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో తొలిసారి ఇలా..

29 Oct, 2023 20:33 IST|Sakshi

భారత్‌-ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో జరిగిన ఓ ఆసక్తికర విషయం, ప్రస్తుతం క్రికెట్‌ అభిమానులను విపరీతంగా ఆకర్శిస్తుంది. అదేంటంటే.. 48 ఏళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో మొట్టమొదటిసారి ఇరు జట్లలోని నంబర్‌ 3 ఆటగాళ్లు సున్నా పరుగులకే ఔటయ్యారు. ఇన్నేళ్ల ప్రపంచకప్‌ చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి. అందులోనూ ఔటైన ఇ‍ద్దరు బ్యాటర్లు వరల్డ్‌ క్లాస్‌ బ్యాటర్లు కావడంతో ఈ విషయం మరింత వైరలవుతుంది.

భారత్‌ తరఫున నంబర్‌ త్రీగా బరిలోకి దిగిన విరాట్‌ 9 బంతులు ఆడి డేవిడ్‌ విల్లే బౌలింగ్‌లో బెన్‌ స్టోక్స్‌కు క్యాచ్‌ ఇచ్చి డకౌట్‌ కాగా.. ఇంగ్లండ్‌ తరఫున నంబర్‌ త్రీగా బరిలోకి దిగిన జో రూట్‌ బుమ్రా బౌలింగ్‌లో తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు.

ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. విరాట్‌ కోహ్లి డకౌటయ్యాక ఇంగ్లండ్‌ బార్మీ ఆర్మీ (ఇంగ్లండ్‌ మద్దతుదారుల క్లబ్‌) ఓవరాక్షన్‌ చేసి ఓ వ్యంగ్యమైన ట్వీట్‌ చేసింది. కోహ్లి డకౌట్‌ అయ్యాడని హేళన చేస్తూ బాతుకు (డక్‌) అతని ఫోటో అతికించి అతి చేసింది. అయితే వారి రాక్షసానందం ఎంతోసేపు నిలువలేదు. వారు విపరీతంగా అభిమానించే సొంత జట్టు ఆటగాడు జో రూట్‌ కూడా సున్నా పరుగులకే డకౌటయ్యాడు. అది కూడా కోహ్లి కంటే హీనంగా గోల్డెన్‌ డక్‌గా (తొలి బంతికే ఔట్‌) వెనుదిరిగాడు. అనంతరం బార్మీ ఆర్మీ అతికి కౌంటర్‌గా భారత అభిమానులు కూడా విరుచుకుడుతున్నారు. 

ఇదిలా ఉంటే, ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (101 బంతుల్లో 87; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) ఆడి జట్టు గౌరవప్రదమైన స్కోర్‌ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ (58 బంతుల్లో 39; 3 ఫోర్లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (47 బంతుల్లో 49; 4 ఫోర్లు, సిక్స్‌) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. 

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడుతూ ఓటమి దిశగా పయనిస్తుంది. ఆ జట్టు 23.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. బెయిర్‌స్టో (14), మలాన్‌ (16), రూట్‌ (0), స్టోక్స్‌ (0), బట్లర్‌ (10), మొయిన్‌ అలీ (15) ఔట్‌ కాగా.. లివింగ్‌స్టోన్‌ (20), క్రిస్‌ వోక్స్‌ క్రీజ్‌లో ఉన్నారు. షమీ 3, బుమ్రా 2, కుల్దీప్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.


    

మరిన్ని వార్తలు