Virat Kohli: కోహ్లి సాధించేశాడు.. సచిన్‌ సెంచరీల రికార్డు బద్దలు

15 Nov, 2023 17:08 IST|Sakshi

క్రీజులో కుదురుకునేంత వరకు నెమ్మదిగా... పిచ్‌ స్వభావాన్ని, అవసరాన్ని బట్టి మధ్య ఓవర్లలో దూకుడుగా.. ఆఖరి వరకు ఉంటే ఆకాశమే హద్దుగా.. వన్డే క్రికెట్‌లో విరాట్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ స్టైల్‌ ఇది. టెస్టు, టీ20 ఫార్మాట్ల కంటే 50 ఓవర్ల క్రికెట్‌లో మిగతా మేటి బ్యాటర్లందరికంటే కోహ్లిని ప్రత్యేకంగా నిలిపింది ఈ లక్షణమే!

ముందుగా బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఒకలా.. ఛేజింగ్‌లో అయితే మరోలా.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ తన లెక్కలు మారిపోతూ ఉంటాయి. కానీ తానేం చేయాలి, తన ప్రణాళికలు ఎలా అమలు పరచాలన్న వ్యూహాల్లో మాత్రం స్పష్టత అలాగే ఉంటుంది. 

మిగతా బ్యాటర్లు తొలి ఇన్నింగ్స్‌లో స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేస్తూ పరుగుల దాహం తీర్చుకుంటే.. కోహ్లికి మాత్రం లక్ష్య ఛేదనలోనే మరింత ఊపొస్తుంది. ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ తనలోని బ్యాటర్‌ మరింత దూకుడుగా మారిపోతాడు. ఇంకా.. ఇంకా మెరుగ్గా ఆడాలనే కసితో ముందుకు సాగుతాడు. అందుకే ఛేజింగ్‌లో కింగ్‌గా మారాడు కోహ్లి.

ఇప్పటి వరకు లక్ష్య ఛేదనలో భాగంగా 27 శతకాలు బాదిన ఈ రన్‌మెషీన్‌.. తాజాగా ప్రపంచకప్‌-2023 సెమీ ఫైనల్లో 100 పరుగులు చేసి.. తొలి ఇన్నింగ్స్‌లో తన సెంచరీల సంఖ్యను 23కు పెంచుకున్నాడు. అయితే, ఈ సెంచరీ అట్లాంటి ఇట్లాంటి సెంచరీ కాదు.. క్రికెట్‌ ప్రపంచంలో ఉన్న ఏకైక సెంచరీల వీరుడు సచిన్‌ టెండుల్కర్‌ పేరిట ఉన్న ఆల్‌టైమ్‌ రికార్డును బద్దలు కొట్టిన సెంచరీ!!

అవును కోహ్లి సాధించేశాడు.. సెల్యూట్‌ కింగ్‌ కోహ్లి!! కేవలం నీ ఆటకే కాదు.. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే నీ తత్వానికి!! చప్పట్లతో నిన్ను అభినందించిన ‘క్రికెట్‌ గాడ్‌’  సచిన్‌ టెండుల్కర్‌కు సలాం చేస్తూ మరోసారి నీ ప్రత్యేకతను చాటుకున్నందుకు!!

టీమిండియా పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఓవరాల్‌గా 50వ శతకం సాధించాడు. తద్వారా టీమిండియా లెజెండ్‌ సచిన్‌ టెండుల్కర్‌ సెంచరీ(49)ల రికార్డును బద్దలు కొట్టాడు. ప్రపంచకప్‌-2023లో భాగంగా తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘనత సాధించాడు. 

అంతకు ముందు.. వన్డే వరల్డ్‌కప్‌ ఎడిషన్లలో సెమీస్‌లో మొత్తంగా కేవలం 11 పరుగులు(9, 1, 1) చేసిన కోహ్లి.. ఈసారి ఏకంగా 117 రన్స్‌ కొట్టేశాడు. సెమీ ఫైనల్‌ గండాన్ని దాటేసి జట్టును భారీ స్కోరు దిశగా నడిపించాడు.

అత్యధిక వన్డే సెంచరీలు:
►50 - విరాట్ కోహ్లి
►49 - సచిన్ టెండూల్కర్
►31 - రోహిత్ శర్మ
►30 - రికీ పాంటింగ్
►28 - సనత్ జయసూర్య

A post shared by ICC (@icc)

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు