CWC 2023 NZ Vs SL: వరల్డ్‌కప్‌లో నేడు అత్యంత కీలక మ్యాచ్‌.. కివీస్‌ భారీ తేడాతో గెలిస్తే..!

9 Nov, 2023 07:46 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌ 2023లో ఇవాళ (నవంబర్‌ 9) అత్యంత కీలకమైన మ్యాచ్‌ జరుగనుంది. బెంగళూరు వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో శ్రీలంక,న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. సెమీస్‌ రేసులో ముందువరుసలో ఉన్న న్యూజిలాండ్‌ ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. లంకపై కివీస్‌ భారీ తేడాతో గెలిస్తే, సెమీస్‌ రేసులో ఉన్న పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌లతో పోటీ ఉండదు. ఆయా జట్ల గెలుపోటములతో సంబంధం లేకుండా న్యూజిలాండ్‌ సెమీస్‌కు చేరుకుంటుంది. 

లంక చేతితో ఓడినా సెమీస్‌కు చేరే అవకాశం ఉంటుంది..
ఒకవేళ ఇవాళ జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్‌.. శ్రీలంక చేతిలో ఓడినా సెమీస్‌ చేరే అవకాశం ఉంటుంది. అదెలా అంటే.. సెమీస్‌ రేసులో ఉన్న మిగతా రెండు జట్లు తమతమ ప్రత్యర్దుల చేతుల్లో ఓడాల్సి ఉంటుంది. అప్పుడు న్యూజిలాండ్‌, పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌కు సమానంగా 8 పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మెరుగైన రన్‌రేట్‌ కలిగిన జట్టు సెమీస్‌కు చేరుకుంటుంది. 

ఎవరు గెలిచినా సెమీస్‌లో టీమిండియానే ప్రత్యర్ధి..
ప్రస్తుతం సెమీస్‌ రేసులో ఉన్న మూడు జట్లలో (కివీస్‌, పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌) ఏ జట్టు ఫైనల్‌ ఫోర్‌కు అర్హత సాధించినా అక్కడ వారి ప్రత్యర్ది టీమిండియానే అవుతుంది. ఎందుకంటే.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు.. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో తలపడాల్సి ఉంది. రెండు, మూడు స్థానాల్లో నిలిచే జట్లు మరో సెమీస్‌లో తలపడతాయి. 

ప్రస్తుత ఎడిషన్‌లో వరుసగా 8 మ్యాచ్‌ల్లో గెలిచిన భారత్‌.. తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో ఓడినా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే నిలుస్తుంది. అలాగే రెండు, మూడు స్థానాల్లో ఉన్న సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు సైతం మరో లీగ్‌ మ్యాచ్‌ ఆడాల్సి ఉన్నప్పటికీ.. గెలుపోటములు వారి స్థానాలపై ప్రభావం చూపవు. కాబట్టి రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్‌ పోరు ఖరారైపోయింది.

సెమీస్‌ ఎప్పుడు, ఎక్కడ అంటే..
ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో సెమీస్‌లో తలపడే జట్లు ఏవో తేలిపోయింది. తొలి సెమీస్‌లో భారత్‌తో తలపడబోయే జట్టు ఏదో తేలాల్సి ఉంది. ప్రస్తుతం సెమీస్‌ రేసులో ఉన్న కివీస్‌, పాక్‌, ఆఫ్ఘనిస్తాన్‌లలో ఏ జట్టు సెమీస్‌కు చేరినా ముంబై వేదికగా నవంబర్ 15న భారత్‌తో తలపడాల్సి ఉంటుంది. కోల్‌కతా వేదికగా నవంబర్‌ 16న జరిగే రెండో సెమీస్‌లో సౌతాఫ్రికా, ఆసీస్‌ పోరు ఖాయమైపోయింది. ఈ రెండు సెమీస్‌లలో గెలిచే జట్లు నవంబర్‌ 19న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.  

మరిన్ని వార్తలు