CWC 2023: మా విజయానికి ప్రధాన కారణం అదే.. అతడో లెజెండ్‌: ఆసీస్‌ కెప్టెన్‌

20 Nov, 2023 10:36 IST|Sakshi
విజయంపై ఆసీస్‌ కెప్టెన్‌ హర్షం (PC: ICC)

CWC 2023 Winner Australia- Pat Cummins Comments: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ గెలవడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందని ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ హర్షం వ్యక్తం చేశాడు. జట్టు సమిష్టిగా రాణించడం వల్లే ఈ అపురూప విజయం సాధ్యమైందని పేర్కొన్నాడు. భారత్‌లో ఐసీసీ ట్రోఫీ గెలవడం అద్భుతమైన అనుభూతి అని.. తన జీవితంలో ఈ క్షణాలు మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయని ఉద్వేగానికి లోనయ్యాడు.

లక్ష పైచిలుకు అభిమానుల నడుమ
కాగా ప్రపంచకప్‌-2023లో ఆదిలో ఓటముల పాలైన ఆస్ట్రేలియా అనూహ్య రీతిలో పుంజుకుని ఫైనల్‌కు దూసుకువచ్చింది. సౌతాఫ్రికాతో సెమీస్‌లో పోరాడి గెలిచిన కంగారూ జట్టు తుదిపోరులో ఆతిథ్య టీమిండియాపై జయభేరి మోగించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం లక్ష పైచిలుకు భారత అభిమానుల మధ్య ఆతిథ్య జట్టును ఓడించి.. గెలిచి టైటిల్‌ సొంతం చేసుకుంది.

టాస్‌ గెలిచి తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన ఆసీస్‌ 240 పరుగులకే కట్టడి చేసింది. లక్ష్య ఛేదనలో ఆరంభంలో తడబడ్డా ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ శతకం(137)తో చెలరేగి జట్టును విజయతీరాలకు చేర్చాడు.

A post shared by ICC (@icc)

పిచ్‌కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం
ఈ సందర్భంగా కమిన్స్‌ మాట్లాడుతూ.. ‘‘మా అత్యుత్తమ ప్రదర్శనను ఫైనల్‌ కోసం దాచి ఉంచినట్లుంది. కీలక మ్యాచ్‌లలో ఆడే సత్తా ఉన్నవారంతా సరైన సమయంలో స్పందించారు. ఇలాంటి ఛేదన సులువని మేం భావించాం. మా బౌలింగ్‌ చాలా బాగా సాగింది. పిచ్‌కు అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నాం. జట్టులో ఎక్కువ వయస్సున్నవాళ్లు ఉన్నా అంతా రాణించారు. 

టీమిండియాను 300 లోపు కట్టడి చేద్దామనుకుంటే 240కే ఆపగలిగాం. ఛేదనలో నా గుండె దడ కూడా పెరిగింది. కానీ హెడ్, లబుషేన్‌ కలిసి గెలిపించారు. చేయి విరిగిన తర్వాత కూడా హెడ్‌పై మేం నమ్మకం ఉంచి జట్టుతో కొనసాగించడం పని చేసింది. 

ఆటపై విపరీత అభిమానం చూపించే భారత గడ్డపై మ్యాచ్‌ ఆడటమే ఒక మంచి జ్ఞాపకం. అలాంటిది మేం ఇక్కడ ప్రపంచకప్‌ గెలుచుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ క్షణాన్ని చిరస్మరణీయంగా మార్చుకోగలిగాం. మేము సాధించిన విజయాల్లో ఇది ఎప్పుటికీ శిఖరాగ్రాన నిలిచిపోతుంది’’ అని సంతోషం వ్యక్తం చేశాడు. 

A post shared by ICC (@icc)

మరిన్ని వార్తలు