SRH Vs MI: ఇద్దరే 166 బాదారు.. ఒక్క మ్యాచ్‌తో విమర్శకుల నోళ్లు మూయించారు

8 Oct, 2021 22:56 IST|Sakshi
Courtesy: IPL Twitter

Ishan Kishan And Surya Kumar Yadav Stunning Batting.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే ముంబై టోర్నీ నుంచి వెళ్లిపోతూ.. టి20 ప్రపంచకప్‌కు ముందు మాత్రం ఇద్దరికి తమకు ఇచ్చిన చాన్స్‌ను నిరూపించుకునేందుకు ఉపయోగపడింది. వారిద్దరే ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు. మరికొద్దిరోజుల్లో టి20 ప్రపంచకప్‌ మొదలుకానున్న నేపథ్యంలో ఈ ఇద్దరు టీమిండియా టి20 జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఐపీఎల్‌లో వీరిద్దరి దారుణ ఫామ్‌పై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు కళ్లు చెదిరే ఇన్నింగ్స్‌లతో మెరిశారు. మొదట ఇషాన్‌ కిషన్‌ 32 బంతుల్లోనే 11 ఫోర్లు, 4 సిక్సర్లతో 84 పరుగులు చేసి ముంబై ఇండియన్స్‌ భారీ స్కోరు చేసేందుకు బాటలు పరిచాడు. ఇషాన్‌ ఔటైన తర్వాత బాధ్యతను భుజానికెత్తుకున్న సూర్యకుమార్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లకు తన ఆటతీరును రుచి చూపించాడు. 40 బంతుల్లోనే 13 ఫోర్లు,3 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. విశేషమేమిటంటే ముంబై చేసిన 235 పరుగుల్లో ఈ ఇద్దరు కలిసి 166 పరుగులు బాదడం విశేషం. మొత్తంగా 12 ఓవర్లు బ్యాటింగ్‌ చేసిన ఈ ఇద్దరు 24 ఫోర్లు, 7 సిక్సర్లు బాదారు. ఇక మిగతా బ్యాటర్స్‌ కలిపి 8 ఓవర్లలో 58 పరుగులు చేసింది. 


Courtesy: IPL Twitter

కాగా టి20 ప్రపంచకప్‌ 2021కి సంబంధించి టీమిండియా జట్టులో మార్పులకు సంబంధించి రేపు సెలెక్టర్ల సమావేశం జరగనుంది. ఫామ్‌లో లేని ఆటగాళ్లను జట్టులో నుంచి తప్పించి ఎవరికి అవకాశం ఇవ్వాలనేదానిపై కీలక నిర్ణయం తీసుకోనుంది. తాజాగా ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ల రాణింపుతో సెలెక్టర్లు వీరిద్దరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

మరిన్ని వార్తలు