PAK vs AUS: 20 పరుగుల వ్యవధిలో ఆలౌట్‌.. పేరును సార్థకం చేసుకున్న పాక్‌ జట్టు

23 Mar, 2022 19:26 IST|Sakshi

పాకిస్తాన్‌ జట్టు అంటేనే నిలకడలేమి ఆటకు మారుపేరు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఎవరికి అర్థం కాదు. బాగా ఆడుతున్నారు అని మెచ్చుకునే సమయంలోనే తమదైన చెత్త ఆటతీరుతో విమర్శలు కొనితెచ్చుకుంటారు. కచ్చితంగా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్‌లు ఓడిపోవడం.. ఓడిపోతుంది అన్న మ్యాచ్‌ల్లో అద్బుతాలు చేసి గెలవడం వారికి మాత్రమే సాధ్యమైంది. ఎన్నో ఏళ్లుగా ఇది చూస్తూనే వచ్చాం. తాజాగా అలాంటి సీన్‌ మరోసారి రిపీట్ అయింది. లాహోర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్‌ కేవలం 20 పరుగుల వ్యవధిలో ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. 248 పరుగులకు 4 వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించింది.

బాబర్‌ అజమ్‌ క్రీజులో ఉండడంతో మరోసారి మంచి ప్రదర్శన చేస్తుందేమోనని మనం భావించేలోపే పాక్‌ ఇన్నింగ్స్‌ పేక మేడను తలపించింది. 20 పరుగుల వ్యవధిలో మిగతా ఆరు వికెట్లు కోల్పోయి 268 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా  ఆసీస్ కు 123 పరుగుల  తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది.  ఆసీస్ సారథి పాట్ కమిన్స్ ఐదు వికెట్లు తీయగా... మిచెల్ స్టార్క్ కు నాలుగు వికెట్లు దక్కాయి. అంతకముందు మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 90-1 పరుగుల వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్..  షఫీక్ (228 బంతుల్లో 81), అజర్ అలీ (208 బంతుల్లో 78) లు రెండో వికెట్ కు 150 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

సెంచరీల వైపునకు దూసుకెళ్తున్న ఈ జంటను ఆసీస్ స్పిన్నర్ లియన్  విడదీశాడు. లియాన్ బౌలింగ్ లో షఫీక్.. కీపర్ అలెక్స్ కేరీకి  క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కొద్ది సేపటి తర్వాత అజర్ అలీ కూడా కమిన్స్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 131 బంతులాడి 67 పరుగులు చేశాడు.  అయితే అతడికి చేయూతనిచ్చేవారే కరువయ్యారు. పాక్ ఇన్నింగ్స్ 106.3 ఓవర్లో ఫవాద్ ఆలం (13) ను స్టార్క్ ఎల్బీడబ్ల్యూ గా  ఔట్ చేశాడు.

అప్పుడు మొదలైంది వికెట్ల పతనం. ఆలం నిష్క్రమించే సమయానికి పాక్ స్కోరు 106 ఓవర్లలో 248-4. ఆ వెంటనే నాలుగు ఓవర్ల తర్వాత కీపర్ మహ్మద్ రిజ్వాన్ (1) ను కూడా స్టార్క్  ఔట్ చేశాడు. 113 ఓవర్లో సాజిద్ ఖాన్ (6)నను కమిన్స్ బౌల్డ్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లో నౌమన్ అలీ (0)తో పాటు హసన్ అలీ (0) లను కమిన్స్ డకౌట్ గా ఐట్ చేశాడు.  ఇక 116వ ఓవర్లో బాబర్ ఆజమ్ ను స్టార్క్ ఎల్బీడబ్ల్యూ గా పెవిలియన్ కు చేర్చాడు. నసీమ్ షా (0) ను స్టార్క్ బౌల్డ్ చేయడంతో పాక్ ఇన్నింగ్స్ కు తెరపడింది.  అంతకముందు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌట్‌ అయింది.

తొలి ఇన్నింగ్స్ లో దక్కిన ఆధిక్యంతో ఆస్ట్రేలియా తిరిగి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది.  ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 3 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 11 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా (7 నాటౌట్), డేవిడ్ వార్నర్ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు.  ప్రస్తుతం ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యంలో ఉంది.  రావల్పిండి, కరాచీలో కాకుండా లాహోర్ పిచ్ కాస్త బౌలర్లకు కూడా సహకరిస్తుండటంతో ఈ టెస్టులో ఫలితం తేలే అవకాశం ఉంది. ఈ టెస్టులో నాలుగో రోజు ఆట అత్యంత కీలకం. ఆసీస్ ఎన్ని పరుగులు చేసి పాక్ కు లక్ష్యాన్ని నిర్దేశించనుందనేదానిమీద ఆ జట్టు విజయావకాశాలు ముడిపడి ఉన్నాయి.

చదవండి: IPL 2022: సిగ్గుచేటు.. బయటోడికి, మనోడికి తేడా తెలియడం లేదా?

Babar Azam: నిబంధనను పాతరేసిన పాక్‌ కెప్టెన్‌.. యాక్షన్‌ తీసుకోవాల్సిందే!

మరిన్ని వార్తలు