వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌.. టాప్‌లో మ్యాక్స్‌వెల్‌, ఆతర్వాత భారత ఆటగాడు

9 Nov, 2023 11:37 IST|Sakshi

వన్డేల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల వివరాలను ప్రముఖ ఆస్ట్రేలియా మీడియా సంస్థ ఫాక్స్‌ క్రికెట్‌ ఇవాళ (నవంబర్‌ 9) ప్రకటించింది. వరల్డ్‌కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ నేపథ్యంలో ఫాక్స్‌ క్రికెట్‌ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా టాప్‌-10లో ఇద్దరు భారత ఆటగాళ్ల ఇన్నింగ్స్‌లకు చోటు దక్కడం విశేషం. 

ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్‌పై మ్యాక్సీ ఆడిన ఇన్నింగ్స్‌కు (201 నాటౌట్‌) టాప్‌ ప్లేస్‌ దక్కగా.. 2014లో శ్రీలంకపై రోహిత్‌ శర్మ సాధించిన 264 పరుగుల ఇన్నింగ్స్‌కు రెండో స్థానం లభించింది. 1984లో ఇంగ్లండ్‌పై విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌ 189 పరుగుల ఇన్నింగ్స్‌, 1983 వరల్డ్‌కప్‌లో జింబాబ్వేపై కపిల్‌ దేవ్‌ 175 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 

ఆతర్వాతి స్థానాల్లో 2006లో ఆసీస్‌పై సౌతాఫ్రికా ఆటగాడు హర్షల్‌ గిబ్స్‌ 175 పరుగుల ఇన్నింగ్స్‌, 2007లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్‌ 149 పరుగుల ఇన్నింగ్స్‌లు నిలిచాయి. ఏడో స్థానంలో ఏబీ డివిలియర్స్‌ (2015లో వెస్టిండీస్‌పై 149 పరగులు), ఎనిమిది, తొమ్మిది, పది స్థానాలు మార్టిన్‌ గప్తిల్‌ (2015లో వెస్టిండీస్‌పై 237 నాటౌట్‌), సనత్‌ జయసూర్య (2000లో భారత్‌పై 189 పరుగులు), సయ్యద్‌ అన్వర్‌ (1997లో భారత్‌పై 194 పరుగులు) ఇన్నింగ్స్‌లకు దక్కాయి. 

మరిన్ని వార్తలు