WC 2023: ఇంగ్లండ్‌ను చూస్తుంటే దేశం కోసం ఆడుతున్నట్లు లేదు.. గంభీర్‌ సంచలన వ్యాఖ్యలు

27 Oct, 2023 20:11 IST|Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ తమ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గురువారం బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఇంగ్లీష్‌ జట్టు ఓటమి చవిచూసింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ కేవలం 156 పరుగులకే కుప్పకూలింది. బెన్‌ స్టోక్స్‌(46 పరుగులు) మినహా మిగితా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు.

157 పరుగుల లక్ష్యాన్ని లంక కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్‌.. కేవలం ఒక్క విజయంతో పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్ధానంలో కొనసాగుతోంది.

ఈ వరల్డ్‌కప్‌లో తమ స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న ఇంగ్లండ్‌ జట్టుపై మాజీ క్రికెటర్‌లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ చేరాడు.  స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో పాల్గోన్న గంభీర్‌కు.. ఇంగ్లండ్‌ ఓటములకు బ్యాటింగ్‌ కారణమా? బౌలింగ్‌ కారణమన్న ప్రశ్న ఎదురైంది.

"ఈ టోర్నీలో ఇంగ్లండ్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండింటిల్లోనూ నిరాశపరిచింది. వరల్డ్‌కప్‌ తొలి మ్యాచ్‌ నుంచే ఇంగ్లండ్‌ జట్టు చాలా నిరూత్సహంగా కన్పిస్తోంది. బ్యాటింగ్‌ తీరు అయితే మరి దారుణంగా ఉంది. మొత్తం బ్యాటింగ్ యూనిట్‌లో ఒక్క బ్యాటర్ కూడా బాధ్యతతో ఆడినట్లు కన్పించడం లేదు. 

జట్టులో చాలా ‍మంది ఆటగాళ్లు తమ పరువు కోసం ఆడుతున్నారు తప్ప దేశం కోసం కాదు. శ్రీలంకపై మొదటి 7 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 350 పరుగులపైగా వస్తుంది అనుకున్నాను. కానీ ఏ ఒక్క బ్యాటర్‌ కూడా క్రీజులో నిలదొక్కుకోవడానికి ప్రయత్నించలేదు.

జో రూట్ అవుట్ అయిన తర్వాత చాలా చెత్త షాట్లు ఆడి వికెట్‌ను పారేసుకున్నారు. శ్రీలంక మాత్రం అద్భుతంగా బౌలింగ్‌ చేసింది. అందుకే వారు విజయం సాధించారు" అని స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో గంభీర్‌ పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌.. టీమిండియా హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్!

మరిన్ని వార్తలు