CWC 2023: సొంత బిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు.. గొప్ప సందేశం ఇచ్చారు: పాక్‌ లెజెండ్‌

22 Nov, 2023 14:43 IST|Sakshi

ICC WC 2023- PM Modi Gesture: టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోదీ మద్దతుగా నిలిచిన తీరుపై పాకిస్తాన్‌ లెజెండరీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ ప్రశంసలు కురిపించాడు. తన చర్య ద్వారా దేశం మొత్తం జట్టుకు అండగా ఉందనే సందేశాన్ని ఇచ్చారని ప్రధానిని కొనియాడాడు. ఆటగాళ్లను తన సొంత బిడ్డల్లా ఆప్యాయంగా హత్తుకున్న విధానం ఎంతో గొప్పగా ఉందని ప్రశంసించాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. సెమీస్‌ వరకు అజేయంగా కొనసాగిన టీమిండియా అహ్మదాబాద్‌లో ఆదివారం నాటి తుదిపోరులో మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. ఫలితంగా సొంతగడ్డపై ట్రోఫీ అందుకోవాలన్న కల చెదిరిపోయింది.

కళ్లలో నీళ్లు నింపుకొని
ఈ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ప్లేయర్లు విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ షమీ, కేఎల్‌ రాహుల్‌ తదితరులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. లక్ష పైచిలుకు అభిమానుల మధ్య ఎదురైన పరాభవాన్ని తట్టుకోలేక.. కళ్లలో నీళ్లు నింపుకొని మైదానాన్ని వీడారు.

షమీని ఆత్మీయంగా హత్తుకుని
దీంతో అభిమానులు కూడా కన్నీటి పర్యంతమయ్యారు. టీమిండియాను ప్రేమించే వాళ్లంతా హృదయం ముక్కలైందంటూ సోషల్‌ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రధాని మోదీ భారత జట్టు డ్రెస్సింగ్‌రూంకు వెళ్లి ఆటగాళ్లను ఓదార్చారు.

రోహిత్‌, కోహ్లిలను దగ్గరకు తీసుకుని.. ఆటలో గెలుపోటములు సహజమంటూ నచ్చజెప్పారు. మహ్మద్‌ షమీని ఆప్యాయంగా హత్తుకుని మరేం పర్లేదంటూ ఓదార్చారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

సొంతబిడ్డల్లా అక్కున చేర్చుకున్నారు
ఈ నేపథ్యంలో రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌ జీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘డ్రెస్సింగ్‌రూంకి వెళ్లి.. వాళ్లకు తానున్నానంటూ ప్రధాని ధైర్యం చెప్పారు. దేశం మొత్తం మీ వెంటే ఉందనే సందేశాన్ని ఇచ్చారు.

నిజానికి భారత్‌కు అదొక ఉద్విగ్న క్షణం. అలాంటి సమయంలో ప్రధాని మోదీ ఆటగాళ్లను తన సొంతపిల్లల్లా అక్కున చేర్చుకున్నారు. వాళ్లకు నైతికంగా మద్దతునిచ్చి తలెత్తుకోవాలంటూ స్ఫూర్తి నింపారు. ఆటగాళ్ల పట్ల ఆయన ఎంతో గొప్పగా వ్యవహరించారు’’ అని ప్రశంసల వర్షం కురిపించాడు.  

చదవండి: CWC 2023: అక్క చెప్పింది నిజమే!.. అంతా మన వల్లే.. ఎందుకీ విద్వేష విషం?

మరిన్ని వార్తలు