WC 2023: భారత్‌-ఆసీస్‌ ఫైనల్‌ పోరు.. హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

18 Nov, 2023 21:14 IST|Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్‌ మ్యాచ్‌కు అంతా సిద్దమైంది. ఆదివారం అహ్మదాబాద్‌ వేదికగా జరగనున్న టైటిల్‌ పోరులో భారత్‌-ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ తుది పోరు కోసం ఇరు జట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఈ హైవోల్టేజ్‌ మ్యాచ్‌ను ప్రత్యేక్షంగా వీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా  ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్  హాజరు కానున్నారు. 

ఈ మెగా పోరు నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌లో భారత్‌-ఆస్ట్రేలియా హెడ్‌ టూ హెడ్‌ రికార్డులు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిద్దాం. వన్డే ప్రపంచకప్‌ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటివరకు 13 మ్యాచ్‌ల్లో ముఖాముఖి తలపడ్డాయి. అందులో ఎనిమిది సార్లు ఆస్ట్రేలియా విజయం సాధించగా.. టీమిండియా ఐదు మ్యాచ్‌లలో గెలుపొందింది.

అయితే చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు సార్లు ఆసీస్‌పై భారత్‌ విజయం సాధించింది. ఈ ఏడాది టోర్నీ లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ను భారత్‌ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. కాగా భారత్‌ విజయం సాధించిన ఐదు మ్యాచ్‌ల్లో.. మొదట బ్యాటింగ్ చేస్తూ గెలిచినవి రెండు,  ఛేజింగ్‌ చేస్తూ మూడు మ్యాచ్‌ల్లో విజయభేరి మోగించింది.

ఇక ఓవరాల్‌ వన్డేల్లో కూడా భారత్‌పై ఆసీస్‌దే పై చేయి. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా, ఇండియా 150 వన్డేల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో 83 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా విజయం సాధించగా..  57 మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుపొందింది. 10 మ్యాచ్‌ల్లో ఎటువంటి ఫలితం తేలలేదు. అయితే ఈ మధ్య కాలంలో ఆసీస్‌పై భారత్‌ పైచేయి సాధిస్తూ వస్తుంది. వరల్డ్‌కప్‌కు ముందు ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్‌  2-1 తేడాతో కైవసం చేసుకుంది.
చదవండి: ఆసీస్‌తో అంత ఈజీ కాదు.. ఏమి చేయాలో మాకు బాగా తెలుసు: రోహిత్‌ శర్మ

మరిన్ని వార్తలు