IND VS ENG 1st Test: పోప్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా కెప్టెన్‌, కోచ్‌

29 Jan, 2024 12:12 IST|Sakshi

హైదరాబాద్‌ టెస్ట్‌లో భారీ ద్విశతం (196) సాధించి, తమ ఓటమికి ప్రధాన కారణంగా నిలిచిన ఇంగ్లండ్‌ ఆటగాడు ఓలీ పోప్‌పై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. మ్యాచ్‌ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వీరిద్దరూ పోప్‌ ఆడిన మ్యాచ్‌ విన్నింగ్స్‌ను కొనియాడారు. ద్రవిడ్‌ మాట్లాడుతూ.. గతంలో పలువురు విదేశీ బ్యాటర్లు భారత స్పిన్నర్లను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూశాను.

కానీ పోప్‌లా భారత స్పిన్నర్లను నిలదొక్కుకోనీయకుండా ఇబ్బంది పెట్టిన బ్యాటర్లను చూడలేదు. పోప్‌ వైవిధ్యభరితమైన షాట్లను (రివర్స్‌ స్వీప్‌) ఎంతో సమర్థవంతంగా ఆడి భారత స్పిన్నర్లు లయ తప్పేలా చేశాడు. పోప్‌ ఎదురుదాడికి దిగి భారత స్పిన్నర్లను కుదురుకోనీయకుండా చేశాడు. కష్టమైన పిచ్‌పై పోప్‌ ఆడిన ఇన్నింగ్స్‌ గురిం​చి ఎంత చెప్పినా తక్కువే. ప్రపంచంలోనే మేటి స్పిన్నర్లను పోప్‌ తన బ్యాటింగ్‌ నైపుణ్యంతో ముప్పుతిప్పలు పెట్టాడు.

ఫైనల్‌గా హ్యాట్స్‌ ఆఫ్‌ టు పోప్‌ అంటూ ద్రవిడ్‌ కొనియాడాడు. మరోవైపు పోప్‌ గురించి భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ ఇలా అన్నాడు. భారత గడ్డపై ఓ విదేశీ ప్లేయర్‌ ఆడిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌లలో ఇది (పోప్‌) ఒకటని రోహిత్‌ కితాబునిచ్చాడు. 

ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పర్యాటక ఇంగ్లండ్‌.. టీమిండియాపై 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 190 పరుగుల భారీ లీడ్‌ సాధించినప్పటికీ ఓటమిపాలైంది. ఓలీ పోప్‌ మూడో ఇన్నింగ్స్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడి భారత్‌ ముందు ఫైటింగ్‌ టోటల్‌ను ఉంచడంలో కీలకపాత్ర పోషించాడు. 230 పరుగుల లక్ష్య ఛేదనలో​ తడబడిన భారత్‌ 202 పరుగులకు ఆలౌటై, స్వదేశంలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా ఫిబ్రవరి 2 నుంచి మొదలవుతుంది. 

whatsapp channel

మరిన్ని వార్తలు