IND VS ENG 1st Test: అచ్చొచ్చిన ఉప్పల్‌.. ఇక్కడ టీమిండియాకు తిరుగేలేదు..!

24 Jan, 2024 08:04 IST|Sakshi

టెస్టుల్లో టీమిండియాకు ఉప్పల్‌ మైదానంలో తిరుగులేని రికార్డు

ఇప్పటి వరకు ఆడిన ఐదు టెస్టుల్లో నాలుగింట గెలుపు, ఓ మ్యాచ్‌ డ్రా

రేపటి నుంచి భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు 

2018 తర్వాత టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న హైదరాబాద్‌ 

భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌ వేదికగా గురువారం నుంచి తొలి టెస్ట్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌ కోసం హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో నిమగ్నమై ఉన్నారు. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌ కావడంతో హైదరాబాద్‌ నగర వాసులు ఈ మ్యాచ్‌ చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉప్పల్‌ మైదానంలో టీమిండియాకు ఘనమైన ట్రాక్‌ రికార్డు ఉంది. 

పరుగుల వరద...వికెట్ల జాతర..
ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన ఐదు టెస్టులు అభిమానులకు పసందైన క్రికెట్‌ అందించాయి. ఒకవైపు పరుగుల వరద  పారడంతో పాటు వికెట్ల జాతర కూడా కనిపించింది. ఈ వేదికపై తొలిసారిగా 2010 నవంబర్‌ 12 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరిగింది. అయితే ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది.

ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 117.3 ఓవర్లలో 350 పరుగులకు ఆలౌటైంది. టిమ్‌ మెకింటోష్‌ (102; 10 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో జహీర్‌ ఖాన్, హర్భజన్‌ సింగ్‌ నాలుగేసి వికెట్లు తీశారు. ధోని కెపె్టన్సీలో భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 143.4 ఓవర్లలో 472 పరుగులకు ఆలౌటైంది. హర్భజన్‌ సింగ్‌ (111 నాటౌట్‌; 7 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో అదరగొట్టి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

122 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన న్యూజిలాండ్‌ జట్టును ఓపెనర్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ (225; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) డబుల్‌ సెంచరీతో ఆదుకున్నాడు. న్యూజిలాండ్‌ 135 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 448 పరుగులు చేసి భారత జట్టుకు 327 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 68 పరుగులు చేసింది. 

అశ్విన్‌ మాయాజాలం.. 
2012 ఆగస్టు 23 నుంచి 26 వరకు ఉప్పల్‌ స్టేడియంలో న్యూజిలాండ్‌ జట్టుతో భారత జట్టు రెండో టెస్టు ఆడింది. స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశి్వన్‌ (6/31, 6/54) మ్యాచ్‌ మొత్తంలో 12 వికెట్లు తీసి భారతజట్టు ఇన్నింగ్స్‌ 115 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ముందుగా భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 134.3 ఓవర్లలో 438 పరుగులకు ఆలౌటైంది. చతేశ్వర్‌ పుజారా (159; 19 ఫోర్లు, 1 సిక్స్‌) భారీ సెంచరీ చేశాడు. అనంతరం న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ఫాలోఆన్‌ ఆడిన న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 79.5 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. 

పుజారా ధమాకా.. 
2013 మార్చి 2 నుంచి 5 వరకు భారత్, ఆ్రస్టేలియా జట్ల మధ్య ఈ వేదికపై మూడో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 135 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 9 వికెట్లకు 237 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది. భువనేశ్వర్, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీశారు. అనంతరం భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 154.1 ఓవర్లలో 503 పరుగులకు ఆలౌటైంది.

చతేశ్వర్‌ పుజారా (204; 30 ఫోర్లు, 1 సిక్స్‌) డబుల్‌ సెంచరీ... మురళీ విజయ్‌ (167; 23 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. 266 పరుగులతో వెనుకబడిన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆ్రస్టేలియా అశి్వన్‌ (5/63), రవీంద్ర జడేజా (3/33) దెబ్బకు 67 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. 

కోహ్లి కేక..
2017 ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు భారత్, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య ఈ వేదికపై నాలుగో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 208 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. విరాట్‌ కోహ్లి (204; 24 ఫోర్లు) డబుల్‌ సెంచరీ... మురళీ విజయ్‌ (108; 12 ఫోర్లు, 1 సిక్స్‌), వృద్ధిమాన్‌ సాహా (106 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. దాంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ను 166 ఓవర్లలో 6 వికెట్లకు 687 పరుగులవద్ద డిక్లేర్‌ చేసింది.

అనంతరం బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 127.5 ఓవర్లలో 388 పరుగులకు ఆలౌటైంది. 299 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం పొందిన భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 4 వికెట్లకు 159 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసి బంగ్లాదేశ్‌కు 459 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. బంగ్లాదేశ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 100.3 ఓవర్లలో 250 పరుగులకు ఆలౌటై ఓడిపోయింది. అశ్విన్‌ (4/73), జడేజా (4/78) బంగ్లాదేశ్‌ను దెబ్బ కొట్టారు. 

పది వికెట్లతో విజయం..
2018 అక్టోబర్‌ 12 నుంచి 14 వరకు భారత్, వెస్టిండీస్‌ జట్ల మధ్య ఈ వేదికపై ఐదో టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 10 వికెట్లతో ఘనవిజయం నమోదు చేసింది. ముందుగా విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 311 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్‌ యాదవ్‌ 6 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 367 పరుగులకు ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (92), అజింక్య రహానే (80), పృథ్వీ షా (70) అర్ధ సెంచరీలు చేశారు.

56 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన వెస్టిండీస్‌ 127 పరుగులకే కుప్పకూలింది. ఉమేశ్‌ యాదవ్‌ (4/45), అశి్వన్‌ (2/24), జడేజా (3/12) విండీస్‌ను కట్టడి చేశారు. అనంతరం విండీస్‌ నిర్దేశించిన 72 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ వికెట్‌ కోల్పోకుండా ఛేదించి గెలిచింది.    

>
మరిన్ని వార్తలు