Trolls On BCCI: ప్రపంచంలోనే సంపన్న బోర్డు.. వేల కోట్లు.. కానీ ఇదేం ఖర్మరా బాబూ!

20 Jun, 2022 13:27 IST|Sakshi
ట్రోఫీతో ఇరు జట్ల కెప్టెన్లు కేశవ్‌ మహరాజ్‌, రిషభ్‌ పంత్‌(PC: CSA)

Ind Vs SA T20 Series- 5th T20: ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి! వైట్‌వాష్‌కు బదులు వైట్‌వాష్‌తోనే సమాధానం చెప్పాలి.. కానీ రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. అనువజ్ఞుడైన బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, సీనియర్‌ బౌలర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ షమీ.. చాలా మంది సీనియర్లు జట్టులో లేరు!.. ఆఖరి నిమిషంలో కేఎల్‌ రాహుల్‌ అవుట్‌! యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌కు సారథ్య బాధ్యతలు! 

స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు భారత జట్టులో జరిగిన పరిణామాలు.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో మొదటి రెండింటిలో తెంబా బవుమా బృందం చేతిలో ఓటమి.. 0-2తో వెనుకంజ.. క్లీన్‌స్వీప్‌ సంగతి దేవుడెరుగు.. ఎలాగైనా సిరీస్‌ గెలిస్తే చాలు.. సగటు అభిమాని ఆశ..!

అందుకు తగ్గట్టుగానే పడిలేచిన కెరటంలా పంత్‌ సేన వరుసగా రెండు విజయాలు సాధించింది. ప్రొటిస్‌ జోరుకు బ్రేక్‌ వేస్తూ 2-2తో సిరీస్‌ను సమం​ చేసింది. అదే జోష్‌లో మూడో గెలుపు నమోదు చేసి ట్రోఫీ గెలవాలనే కసితో బెంగళూరుకు చేరుకుంది. కానీ, వరుణుడు టీమిండియా, అభిమానుల ఆశలపై నీళ్లు చల్లాడు.


రూఫ్‌ లీకేజీ(PC: Twitter)

ఇదేం ఖర్మరా బాబు!
సిరీస్‌ విజేతను నిర్ణయించే మ్యాచ్‌ రద్దు అయిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఆసక్తికర పోరును వీక్షిద్దామనుకుంటే ఇలా జరిగిందేమిటబ్బా అని ఉసూరుమన్నారు. మ్యాచ్‌ పోయిందనే బాధతో పాటు డబ్బులు ఖర్చు పెట్టుకుని మ్యాచ్‌ చూడటానికి వస్తే ఇదేం ఖర్మరా బాబూ అంటూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తీరును తిట్టిపోశారు. 

మ్యాచ్‌కు వేదిక అయిన ఎం. చిన్నస్వామి స్టేడియం పైకప్పు నుంచి నీళ్లు కారడమే ఇందుకు కారణం. స్టేడియంలో ప్రేక్షకుల అసౌకర్యాన్ని వివరిస్తూ ఓ నెటిజన్‌.. రూఫ్‌ నుంచి వాటర్‌ లీక్‌ అవుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ‘‘ఈరోజు మ్యాచ్‌ రద్దైన దాని కంటే ఎక్కువగా స్టేడియంలోని పరిస్థితులే మరింత ఎక్కువ నిరాశకు గురిచేశాయి!

ప్రపంచంలోనే సంపన్న బోర్డు... కానీ ఫ్యాన్స్‌కు మాత్రం ఇలాంటి దిక్కుమాలిన పరిస్థితి. బీసీసీఐ, కర్ణాటక బోర్డు ఇంకా ఎప్పుడు వీటిని సరిదిద్దుతాయి. అభిమానికి ఆటను ఆస్వాదించే మజాను అందిస్తాయి’’ అంటూ సెటైర్లు వేశాడు. ఈ క్రమంలో బీసీసీఐ తీరుపై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

కోట్లకు కోట్లు వస్తున్నా దిక్కుమాలిన పరిస్థితి!
బోర్డుపై కనక వర్షం కురుస్తున్నా.. మ్యాచ్‌ చూద్దామని వచ్చిన ప్రేక్షకులపై వర్షం పడకుండా కనీస సౌకర్యాలు కల్పించలేరా అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఏంటి? మాకేంటి? ఇదంతా! అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా.. ఇటీవల ఐపీఎల్‌ మీడియా హక్కులు రికార్డు స్థాయిలో భారీ ధరకు అమ్ముడుపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ బోర్డు తీరును తప్పుపడుతున్నారు.    

చదవండి: Trolls On Ruturaj Gaikwad: అసలేంటి రుతురాజ్‌ నువ్వు? నీ నుంచి ఇది అస్సలు ఊహించలేదు.. మరీ ఇలా చేస్తావా? పాపం..
Rishabh Pant: ఆటగాడిగా, కెప్టెన్‌గా వందకు వంద శాతం.. ఏదేమైనా: పంత్‌ కౌంటర్‌!

మరిన్ని వార్తలు