ఐపీఎల్‌ చరిత్రలో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్స్‌

2 Apr, 2021 19:06 IST|Sakshi

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వరల్డ్‌లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్‌ లీగ్‌ ఐపీఎల్‌. మరి అటువంటి ఐపీఎల్‌లో ఒక జట్టుకు కెప్టెన్‌గా చేసి సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదు. ఐపీఎల్‌లో ఆయా ఫ్రాంచైజీలకు సారథులుగా చేసి జట్టును ముందుకు తీసుకెళ్లడమనేది అతి పెద్ద టాస్క్‌. ఒకవేళ కెప్టెన్‌గా విఫలమైతే అతన్ని ప్లేయర్‌గా తీసుకోవడానికి కూడా ఫ్రాంచైజీలు ఇష్టపడవు. అదే సమయంలో తమ నిలకడైన ఆటతో ఈ క్యాష్‌ రి లీగ్‌ను ఎంజాయ్‌ చేస్తూ సుదీర్ఘ కాలంగా కొంతమంది కెప్టెన్లుగా కొనసాగుతున్న సందర్భాలని కూడా చూశాం.. చూస్తున్నాం. ఐపీఎల్‌-2021సీజన్‌కు సమయం ఆసన్నమైన సందర్భంలో ఈ లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన(విజయాల శాతం పరంగా) టాప్‌-5 కెప్టెన్ల గురించి తెలుసుకుందాం. 

1. రోహిత్‌ శర్మ
ఈ  లీగ్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ముందు వరుసలో ఉన్నాడు. కెప్టెన్‌గా ఎనిమిదేళ్ల ప్రస్థానంలో ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్‌ను రోహిత్‌ అందించాడు. 2013, 2015, 2017, 2019, 2020 సీజన్లలో ముంబై ఇండియన్స్‌ టైటిల్స్‌ సాధించింది. ఈ టైటిల్స్‌ అన్నీ కూడా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలోనే రావడం విశేషం. ఓవరాల్‌గా 116 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన రోహిత్‌.. అందులో 70 విజయాలను సాధించి టాప్‌లో ఉన్నాడు.  కేవలం 45 మ్యాచ్‌ల్లోనే రోహిత్‌ సారథ్యంలోని ముంబై ఓటమి పాలైంది. ఇక్కడ రోహిత్‌ శర్మ విజయాల శాతం  60.34గా ఉంది. 

2. స్టీవ్‌ స్మిత్‌
ఐపీఎల్‌లో రెండు జట్లకు కెప్టెన్‌గా చేశాడు స్టీవ్‌ స్మిత్‌. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సారథిగా సక్సెస్‌ కావడంతో స్టీవ్‌ స్మిత్‌ రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్‌ జట్టుతో పాటు రాజస్తాన్‌ రాయల్స్‌కు కూడా కెప్టెన్‌గా చేశాడు. 2016లో పుణె జట్టు ఐపీఎల్‌లో ఆడగా దానికి ఆ ఏడాది ఎంఎస్‌ ధోని కెప్టెన్‌గా చేశాడు. ఆ మరుసటి సీజన్‌లో స్టీవ్‌స్మిత్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పింది పుణే యాజమాన్యం. ఆ సీజన్‌లో పుణె ఫైనల్‌కు చేరినా ట్రోఫీ గెలవలేకపోయింది. ఫైనల్లో ముంబై చేతిలో ఓటమి పాలై రన్నరప్‌గా సరిపెట్టుకుంది.  ఇక రాజస్తాన్‌ రాయల్స్‌కు పలు సీజన్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు  స్మిత్‌.2018 రీఎంట్రీ ఇచ్చిన రాజస్తాన్‌ రాయల్స్‌కు స్మిత్‌ కెప్టెన్‌గా చేసే అవకాశాన్ని కోల్పోయాడు. మళ్లీ 2019, 2020 సీజన్లలో రాజస్తాన్‌ సారథిగా స్మిత్‌ వ్యవహరించాడు. ఓవరాల్‌గా 42 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేయగా అందులో 25 విజయాలు సాధించాడు. ఇక్కడ పర్సంటేజ్‌ పరంగా స్మిత్‌ రెండో స్థానంలో ఉన్నాడు. స్మిత్‌ విజయాల శాతం 59.52గా ఉంది. 

3. సచిన్‌ టెండూల్కర్‌
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్‌ తరఫున కెప్టెన్‌గా అంతగా సక్సెస్‌ కాలేని మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌.. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు సారథిగా వ్యవహరించిన సందర్బంలో విజయవంతమయ్యాడనే చెప్పాలి. 2010 సీజన్‌లో సచిన్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ ఫైనల్స్‌కు చేరినా ట్రోఫీని సాధించలేకపోయింది. ఆ సీజన్‌ ఫైనల్లో సీఎస్‌కే చేతిలో ముంబై ఇండియన్స్‌ ఓటమి చెంది రన్నరప్‌గా నిలిచింది. ఓవరాల్‌గా సచిన్‌ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ 51 మ్యాచ్‌ల్లో 30 విజయాలను సాధించింది. ఇక్కడ సచిన్‌ విజయాల శాతం 58.82గా ఉంది. 2011 వరకూ ముంబై కెప్టెన్‌గా సచిన్‌ చేయగా, ఆపై 2012లో హర్భజన్‌ సింగ్‌ ఆ జట్టుకు సారథిగా చేశాడు. అటు తర్వాత రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ పగ్గాలు చేపట్టి ఆ జట్టును చాంపియన్‌గా ఐదుసార్లు నిలిపాడు. 

4. ఎంఎస్‌ ధోని 
2008 నుంచి ఇప్పటివరకూ చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సారథిగా వ్యవహరిస్తూ వస్తున్నది ఎంఎస్‌ ధోనినే. ఇలా ఒక సీజన్‌ ఆరంభం నుంచి ఒక జట్టుకు కెప్టెన్‌గా చేసిన ఏకైక ప్లేయర్‌ ధోని. అతని సారథ్యంలో సీఎస్‌కే మూడు ఐపీఎల్‌ ట్రోఫీలను ముద్దాడింది. 2010, 2011, 2018 సీజన్లలో ధోని సారథ్యంలోని సీఎస్‌కే ట్రోఫీలను సొంతం చేసుకుంది. ఐపీఎల్‌లో 188 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన ధోని.. 110 విజయాలను ఖాతాలో వేసుకున్నాడు.  ధోని సారథ్యంలో సీఎస్‌కే 77 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 2016 సీజన్‌, 2020 సీజన్లు మినహాయిస్తే సీఎస్‌కే ఆడిన ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇక్కడ ధోని విజయాల శాతం 58.51గా ఉంది. కాగా, ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా చేసిన ఘనత ధోనిదే కావడం మరో విశేషం. 

5. కామెరూన్‌ వైట్‌
ఆస్ట్రేలియాకు చెందిన కామెరూన్‌ వైట్‌ మూడు ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు ఆడగా, అందులో ఆర్సీబీ, డెక్కన్‌ చార్జర్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు ఉన్నాయి. వీటిలో డెక్కన్‌ చార్జర్స్‌, ఎస్‌ఆర్‌హెచ్‌ జట్లకు వైట్‌ సారథిగా చేశాడు. 2012 సీజన్‌ మధ్య లో డీసీ కెప్టెన్‌గా వ్యహరించాడు వైట్‌. కుమార సంగక్కారా నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న వైట్‌.. 2013 సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కొన్ని మ్యాచ్‌లకు సారథిగా చేశాడు. మొత్తం 12 మ్యాచ్‌లకు ఐపీఎల్‌లో కెప్టెన్‌గా చేసి అందులో ఏడు విజయాలు అందుకున్నాడు. కామెరూన్‌ వైట్‌ విజయాల శాతం 58.33గా ఉంది. 

ఇక్కడ చదవండి:  సన్‌రైజర్స్‌కు డబుల్‌ ధమాకా..

IPL 2021: కెప్టెన్‌గా ధోని‌.. రైనాకు దక్కని చోటు

మరిన్ని వార్తలు