అక్కడ ఉన్నది ఏబీ.. బౌలింగ్‌ ఎవరికిచ్చావ్‌!

19 Apr, 2021 15:49 IST|Sakshi
Photo Courtesy: IPL/BCCI

చెన్నై:  రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఘోర పరాజయం చవిచూడటం ఒకటైతే, ఆ జట్టు కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ అనుసరించిన వ్యూహాలపై విమర్శల వర్షం కురుస్తోంది. నిన్న ఆర్సీబీ ఇన్నింగ్స్‌ ముగిసిన వెంటనే కేకేఆర్‌ మాజీ కెప్టెన్‌ గౌతం గంభీర్‌.. మోర్గాన్‌ను టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయగా, ఇప్పుడు ఆ జాబితాలో మరో టీమిండియా మాజీ క్రికెటర్‌  ఆకాశ్‌ చోప్రా కూడా చేరిపోయాడు. అసలు మోర్గాన్‌ గేమ్‌ ప్లాన్‌ ఏమిటంటూ తన యూట్యూబ్‌ వేదికగా ధ్వజమెత్తాడు. ఈ క్రమంలోనే కొన్ని ప్రశ్నలను సంధించాడు.  

ప్రధానంగా ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో కేకేఆర్‌ 19 ఓవర్‌ను వేయించే క్రమంలో ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌కు బౌలింగ్‌ ఇవ్వడాన్ని చోప్రా నిలదీశాడు. అలాగే వరుణ్‌ చక్రవర్తి రెండు వికెట్లు ఒకే ఓవర్‌లో తీసిన తర్వాత అతని చేతికి బంతి ఇవ్వడానికి ఓవర్లు ఆలస్యం చేయడాన్ని వేలెత్తిచూపాడు. ‘ రెండు వికెట్లు సాధించిన తర్వాత వరుణ్‌ చక్రవర్తికి ఎందుకు బౌలింగ్‌ ఇవ్వలేదు. ఫామ్‌లో ఉన్న  మ్యాక్స్‌వెల్‌ క్రీజ్‌లోకి వచ్చినప్పుడు వరుణ్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించడమే పెద్ద పొరపాటు. మరొక ఆశ్చర్యకర విషయం హర్భజన్‌ సింగ్‌కు 19 ఓవర్‌ ఇవ్వడం.

అక్కడ ఉన్నది ఏబీ డివిలియర్స్‌. అతను రైట్‌ హ్యాండ్స్‌ బ్యాట్స్‌మన్‌. అంతే కాదు చాలా ప్రమాదకర ఆటగాడు. మరొక ఆటగాడు జెమీసన్‌. ఇద్దరూ రైట్‌ హ్యాండర్లే కదా. మరి అప్పుడు ఆఫ్‌ స్పిన్నర్‌ అయిన భజ్జీకి బౌలింగ్‌ ఇవ్వడం తప్పిందం కాదా. అప్పటికి షకీబుల్‌కు ఇంకా కోటా పూర్తి కాలేదు.  వారికి లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన షకీబుల్‌కు బౌలింగ్‌ ఇవ్వాల్సింది. అలా అయితే ఆ ఓవర్‌లో(18 పరుగులు) అన్ని పరుగులు వచ్చి ఉండేవి కావు. ఇక రసెల్‌ను దినేశ్‌ కార్తీక్‌ను ఔటైన వెంటనే పంపించి ఉంటే బాగుండేది. అలా చేసి ఉంటే రసెల్‌ మరిన్ని బంతులు ఆడే అవకాశం వచ్చేది. ఎప్పుడో 13-14 ఓవర్ల మధ్యలో వచ్చిన రసెల్‌ ఎలా గెలిపిస్తాడు. అక్కడ ఉన్న స్కోరు 150  కాదు.. 200కు పైగా ఉంది. ఈ పిచ్‌పై రెండొందల స్కోరు ఛేజ్‌ చేయాల్సి వచ్చినప్పుడు కేకేఆర్‌ ఓటమి ఖాయమైంది’ అని చోప్రా విమర్శించాడు. 

ఇక్కడ చదవండి: IPL 2021, RCB vs KKR: భళా... బెంగళూరు
14.25 కోట్లు: క్రేజీ అనుకున్నా.. కానీ తప్పని నిరూపించాడు!

 

మరిన్ని వార్తలు