Aakash Chopra: ఆఖరి ఓవర్లో 4 పరుగులు.. చేతిలో వికెట్లు... అయినా ఇదో అలవాటు!

22 Sep, 2021 11:36 IST|Sakshi
Photo Courtesy: Punjab Kings Twitter

Aakash Chopra Comments On Punjab Kings: ‘‘వాళ్లు కచ్చితంగా గెలుస్తారని మనం ఊహిస్తాం. పడిలేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసేలా కనిపిస్తారనుకుంటాం. కానీ.. అలా జరగదు. గెలిచే వాళ్లను బాజీగార్‌ అని ఎలా అయితే పిలుస్తామో.. విజయం సాధించే మ్యాచ్‌ను చేజేతులా ప్రత్యర్థి జట్టుకు అప్పగించే వారిని పంజాబ్‌ కింగ్స్‌ అనాలేమో’’... టీమిండియా మాజీ క్రికెటర్‌, వ్యాఖ్యాత ఆకాశ్‌ చోప్రా రాహుల్‌ సేనను ఉద్దేశించి చేసిన తీవ్ర విమర్శ ఇది. గెలుపు అంచులదాకా వెళ్లి.. ఓటమి పాలవడం పంజాబ్‌కే చెల్లిందన్న అతడి వ్యాఖ్యలతో పలువురు క్రీడా విశ్లేషకులు సైతం ఏకీభవిస్తున్నారు. 

కాగా ఐపీఎల్‌-2021 రెండో అంచెలోని తమ తొలి మ్యాచ్‌లో భాగంగా రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడిన పంజాబ్‌.. తుది వరకు పోరాడి చేతులెత్తేసింది. చివరి ఓవర్‌లో నాలుగు పరుగులు చేస్తే చాలు గెలుపు ఖాయమన్న వేళ.. వికెట్లు చేతిలో ఉన్నా డిఫెన్స్‌ తరహాలో ఆడి ఓటమిని ఆహ్వానించింది. ఇలా ఆఖరి నిమిషంలో పరాజయం చెందడం పంజాబ్‌ కింగ్స్‌కు కొత్తేమీ కాదు. గత సీజన్‌లోనూ ఇదే రాజస్తాన్‌ జట్టు చేతిలోనే ఓడిపోయింది. 223 పరుగుల భారీ స్కోరు చేసినా.. దానిని కాపాడులేకపోయింది.

ఇక మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ రాహుల్‌ సేన పరాజయం చెందడంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా మాట్లాడుతూ.. ‘‘120 పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యం.. ప్రత్యర్థి జట్టు నాలుగు క్యాచ్‌లు డ్రాప్‌ చేసింది. ఆఖరి ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు చేస్తే చాలు.. విజయం వరిస్తుంది. ఇద్దరు బ్యాట్స్‌మెన్‌ క్రీజులో ఉన్నారు.

అయినా రెండు పరుగుల తేడాతో ఓటమి. ఇలా ఎందుకు జరిగిందని తమను తాము ప్రశ్నించుకోవాలి. గెలిచే మ్యాచ్‌ను చేజేతులా పోగొట్టుకోవడం ఏమిటి? మీ ఆట అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ, వాస్తవాలు మాట్లాడక తప్పదు కదా. కచ్చితంగా గెలుస్తారన్న మ్యాచ్‌లో ఓడటం చాలా దారుణం’’ అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా దుబాయ్‌లో జరిగిన సెప్టెంబరు 21 నాటి మ్యాచ్‌లో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ మంచి ఇన్నింగ్స్‌ ఆడినా ఫలితం లేకుండా పోయింది. రాజస్తాన్‌ బౌలర్‌ కార్తీక్‌ త్యాగి డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో పంజాబ్‌కు ఓటమి తప్పలేదు.

స్కోర్లు: రాజస్తాన్‌ రాయల్స్‌: 185-10 (20 ఓవర్లలో) 
పంజాబ్‌ కింగ్స్‌: 183-4 (20 ఓవర్లలో)

చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ!

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు