IPL 2021: టీమిండియా భవిష్యత్తు కెప్టెన్‌ అతడే: బ్రాడ్‌ హాగ్‌

24 Sep, 2021 13:23 IST|Sakshi
Brad Hogg(ఫైల్‌ ఫొటో)

Brad Hogg praises Shreyas Iyer: టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌పై ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్‌ బ్రాడ్‌ హాగ్‌ ప్రశంసలు కురిపించాడు. భవిష్యత్తులో అతడు భారత జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు. శ్రేయస్‌ మానసికంగా ఎంత పరిణతి చెందినవాడో.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం తర్వాత తన ప్రెస్‌మీట్‌ చూసినపుడే అర్థమైందని చెప్పుకొచ్చాడు. కాగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ సందర్భంగా గాయపడిన శ్రేయస్‌ అయ్యర్‌.. కోలుకుని.. ప్రస్తుతం ఐపీఎల్‌-2021 రెండో అంచెలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 47 పరుగులు(నాటౌట్‌) చేసి సత్తా చాటాడు. కాగా.. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్‌ తొలి దశకు దూరమైన నేపథ్యంలో అతడి స్థానంలో, టీమిండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌కు ఢిల్లీ ఫ్రాంఛైజీ సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ప్రస్తుతం అయ్యర్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ పంత్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. పంత్‌ నేతృత్వంలో ఢిల్లీ మంచి విజయాలు సాధించడం ఇందుకు ఒక కారణంగా చెప్పవచ్చు.

అక్కడ కూడా భంగపాటే.. అయినా
ఇదిలా ఉండగా... టీ20 వరల్డ్‌కప్‌నకు ఎంపికైన ప్రధాన ఆటగాళ్లలో శ్రేయస్‌ అయ్యర్‌కు చోటు దక్కలేదన్న సంగతి తెలిసిందే. స్టాండ్‌ బై ప్లేయర్‌గా అతడి పేరును చేర్చారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. బుధవారం నాటి మ్యాచ్‌లో మైదానంలో దిగిన అయ్యర్‌.. మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పంత్‌కు పగ్గాలు అప్పగించినా, ప్రపంచకప్‌ జట్టుకు సెలక్ట్‌ కాకపోయినా.. ఆ ప్రభావం బ్యాటింగ్‌పై పడకుండా జాగ్రత్త పడ్డాడు. పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పేర్కొంటూ హుందాతనం చాటుకున్నాడు.

ఇక ఈ సీజన్‌లో తన తొలి ప్రదర్శన గురించి మాట్లాడుతూ.. అనుకున్న విధంగా శుభారంభం చేయలేకపోయానని, ఆ ఇన్నింగ్స్‌(47 పరుగులు) పెద్దగా సంతృప్తినివ్వలేదని చెప్పుకొచ్చాడు. ఏదేమైనా సానుకూల దృక్పథంతో ముందుకు సాగడమే తన పని అని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ ఓ యూట్యూబ్‌ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘‘గాయం నుంచి కోలుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌నకు సెలెక్ట్‌ కాలేదు. నిజానికి తనపై చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ, ప్రభావం పెద్దగా కనిపించలేదు. పత్రికా సమావేశంలో తను మాట్లాడిన మాటలు చూస్తే టీమిండియా భవిష్యత్తు సారథి అతడే అనిపించాడు.

మొన్నటి మ్యాచ్‌లో మెరుగ్గా ఆడాడు. నిజానికి అయ్యర్‌ లాంటి ఆటగాడు ఉన్నందుకే ఢిల్లీ టాప్‌ పొజిషన్‌కు వచ్చిందని చెప్పవచ్చు. పంత్‌కు కెప్టెన్సీ ఇచ్చినందుకు ఎంతోకొంత బాధ పడే ఉంటాడు. కానీ, తను దానిని బయటపడనివ్వలేదు. జట్టు ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి’’ అని శ్రేయస్‌ అయ్యర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. కాగా 2018లో గౌతం గంభీర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత శ్రేయస్‌ ఆ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అతడి సారథ్యంలో ఢిల్లీ గత సీజన్‌లో ఫైనల్‌ చేరిన సంగతి తెలిసిందే.

చదవండి: T20 World Cup: సెలక్టర్ల నిర్ణయం తప్పని నిరూపించు.. ఇదే మంచి ఛాన్స్‌!

మరిన్ని వార్తలు