CSK Vs MI: పొలార్డ్‌ చేసిన తప్పు ఇదే.. లేదంటే చెన్నై 80 పరుగులకే ఆలౌట్‌ అయ్యేది!

20 Sep, 2021 11:43 IST|Sakshi

Kieron Pollards captaincy blunder vs CSK: ఐపీఎల్‌-2021 రెండో అంచె తొలి మ్యాచ్‌లో ముంబై ప్రదర్శనపై ఇంగ్లండ్‌ దిగ్గజం కెవిన్‌ పీటర్సన్‌ పెదవి విరిచాడు. తాత్కాలిక కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ బౌలర్లు అందించిన ఆరంభాన్ని చక్కగా వినియోగించుకోలేక తప్పిదాలు చేశాడని విమర్శించాడు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా చెన్నై సూపర్‌కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య ఆదివారం తొలి మ్యాచ్‌ జరిగిన విషయం తెలిసిందే.

సారథి రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్యా లేకుండానే మైదానంలో దిగిన డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై.. సీఎస్‌కే చేతిలో ఓటమి పాలైంది. 20 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. పవర్‌ప్లే ముగిసే వరకు చెన్నై కీలక వికెట్లన్నీ కోల్పోయినప్పటికీ.. ఆ అవకాశాన్ని వినియోగించుకోలేపోయింది. అయితే, ఇందుకు ప్రధాన కారణం కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ వ్యూహాలేనని పీటర్సన్‌ అభిప్రాయపడ్డాడు.

ఈ మేరకు అతడు స్టార్‌ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ముంబై ఘనంగా మ్యాచ్‌ ఆరంభించింది. ఆరంభంలో పూర్తి ఆధిపత్యం కనబరిచింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ దూరమైనప్పటికీ, ఆ ఒత్తిడిని జయించి శుభారంభం చేసింది.  పవర్‌ప్లే ముగిసేసరికి సీఎస్‌కే నాలుగు వికెట్లు కోల్పోయింది. అంబటి రాయుడు రిటైర్డ్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఇలా కీలక వికెట్లు పడిన వేళ.. ఆ అవకాశాన్ని ముంబై చక్కగా ఉపయోగించుకోవాల్సింది. కానీ, అక్కడే ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ ట్రిక్‌ మిస్సయ్యాడు. జస్‌ప్రీత్‌ బుమ్రాతో 2 లేదా 3 ఓవర్లు వేయించి ఉండాల్సింది.

అలా అయితే, 40 లేదా 50 పరుగులకే సీఎస్‌కే 7 వికెట్లు కోల్పోయి ఉండేది. 60, 70 లేదంటే 80 పరుగులకే ఆలౌట్‌ అయి ఉండేది. నేనేమీ ఇదంతా ఊరికే ఏం చెప్పడం లేదు. ఒత్తిడిలో ఉన్న బ్యాట్స్‌మెన్‌ను అవుట్‌ చేసేందుకు స్టార్‌ బౌలర్లను బరిలోకి దించడం సత్ఫలితాలను ఇస్తుంది కదా’’అని అభిప్రాయపడ్డాడు. కాగా ఓపెనర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఒత్తిడిలోనూ సూపర్‌ ఇన్నింగ్స్‌(58 బంతుల్లో 88 నాటౌట్‌; 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆడి సీఎస్‌కేకు మంచి విజయాన్ని అందించిన సంగతి తెలిసిందే. ఇక ముంబై బౌలర్లలో ఆడమ్‌ మిల్నే, బుమ్రా, ట్రెంట్‌ బౌల్ట్‌ తలా రెండు వికెట్లు తీశారు.

పొలార్డ్‌ చేసిన తప్పు ఇదేనా?
కాగా ఆరు ఓవర్ల వరకు మిల్నే, బౌల్ట్‌తో బౌలింగ్‌ చేయించిన పొలార్డ్‌.... ఆ తర్వాతి ఓవర్‌లో బుమ్రాను రంగంలోకి దించాడు. అయితే, మళ్లీ 14వ ఓవర్‌ వరకు అతడిని బంతిని ఇవ్వలేదు. 16 ఓవర్‌లో మళ్లీ బుమ్రాకు అవకాశం ఇచ్చినా అప్పటికే రుతురాజ్‌.. నిలదొక్కుకుని తమ జట్టును గౌరవప్రదమైన స్కోరు సాధించే దిశగా తీసుకువెళ్లడంతో డెత్‌ ఓవర్లలో స్టార్‌ పేసర్‌ను దించినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో పీటర్సన్‌ ఈ విధంగా స్పందించడం గమనార్హం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు