జోరు మీదున్న చెన్నై.. వార్నర్‌ సేన ఆ బలహీనత అధిగమిస్తేనే!

28 Apr, 2021 07:56 IST|Sakshi

నేడు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో హైదరాబాద్‌ ‘ఢీ’

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన సూపర్‌ ఓవర్‌ థ్రిల్లర్‌ మ్యాచ్‌లో ఓడిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో కఠిన సవాల్‌కు సిద్ధమైంది. నేడు ఇక్కడ జరిగే మ్యాచ్‌లో మూడుసార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే)తో తలపడనుంది. సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో ఓడిన హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే మాత్రం ఇకనైనా హైదరాబాద్‌ తన పేలవ ప్రదర్శనను పక్కన పెట్టి మెరుగ్గా ఆడాల్సి ఉంది. మరోవైపు ఎంఎస్‌ ధోని నాయకత్వంలోని సీఎస్‌కే వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఆరంభ మ్యాచ్‌లో ఓటమి ఎదురైనా... ఆ తర్వాత నాలుగు వరుస విజయాలతో అదరగొట్టింది. 

అదే బలహీనత... 
ఈ ఐపీఎల్‌ ఆరంభం నుంచి హైదరాబాద్‌ను వేధిస్తోన్న ప్రధాన సమస్య బ్యాటింగ్‌. ఈ కారణంతోనే సన్‌రైజర్స్‌ నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడింది. ఢిల్లీతో జరిగిన గత మ్యాచ్‌లో కేన్‌ విలియమ్సన్‌ చివరి వరకు క్రీజులో నిలిచినా అతనికి మిగతా సభ్యుల నుంచి సహకారం కొరవడింది. మిడిలార్డర్‌లో కేదార్‌ జాదవ్, విజయ్‌ శంకర్, అభిషేక్‌ శర్మలు పూర్తిగా విఫలమయ్యారు. ఎక్కడో తొమ్మిదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సుచిత్‌ దూకుడుగా ఆడటంతో ఆ మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌కు దారి తీసింది. అయితే సూపర్‌ ఓవర్‌లో సన్‌రైజర్స్‌ తీసుకున్న నిర్ణయం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకుముందు 18 బంతుల్లో 38 పరుగులు చేసిన బెయిర్‌స్టోను కాకుండా వార్నర్‌ను విలియమ్సన్‌కు తోడుగా బ్యాటింగ్‌కు పంపింది.

మూడు బంతులను ఎదుర్కొన్న వార్నర్‌ రెండు పరుగులు మాత్రమే చేశాడు. ఓపెనర్‌గా వార్నర్‌ పరుగులు సాధిస్తున్నా ధాటిగా ఆడలేకపోతున్నాడు. బెయిర్‌స్టో, విలియమ్సన్‌ ఫామ్‌లో ఉండటం హైదరాబాద్‌కు ఊరటనిచ్చే అంశం. వీరి తర్వాత బ్యాటింగ్‌లో ఎవరూ నిలకడ ప్రదర్శించకపోవడం జట్టును కలవర పెట్టే అంశం. ఈ సమస్యలను అధిగమిస్తేనే లీగ్‌లో హైదరాబాద్‌ ముందుకు వెళ్లగలదు. మరోపక్క బ్యాటింగ్, బౌలింగ్‌ విభాగాల్లో పటిష్టంగా ఉన్న చెన్నై మరో విజయంపై కన్నేసింది. ఓపెనర్లు డు ప్లెసిస్, రుతురాజ్‌ గైక్వాడ్‌ దంచి కొడుతుండటం... చివర్లో మ్యాచ్‌ను ఫినిష్‌ చేసేందుకు ధోని, జడేజాలు ఉండటంతో నేటి మ్యాచ్‌లో చెన్నై జట్టే హాట్‌ ఫేవరెట్‌గా కనిపిస్తోంది.   

చదవండి: IPL 2021 RCBvsDC: బెంగళూరు బతికిపోయింది

మరిన్ని వార్తలు