ఇలా ఎలా మారిపోయింది?:  ధోని

29 Apr, 2021 06:58 IST|Sakshi

ఢిల్లీ: గత సీజన్‌లో పేలవ ఫామ్‌ కనబర్చిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ ఏడాది మాత్రం తమ జోరు కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం చెన్నై 18.3 ఓవర్లలో 3 వికెట్లకు 173 పరుగులు చేసి విజయాన్నందుకుంది. రుతురాజ్‌ గైక్వాడ్‌ (75), డుప్లెసిస్‌ (56;) అర్ధ సెంచరీలతో జట్టును నడిపించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 78 బంతుల్లోనే 129 పరుగులు జోడించడంతో సీఎస్‌కే విజయం సునాయాసమైంది. 

మ్యాచ్‌ తర్వాత సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని మాట్లాడుతూ.. ‘మా బ్యాటింగ్‌ చాలా అద్భుతంగా ఉంది. అలా అని బౌలింగ్‌ బాలేదని కాదు. రెండు విభాగాల్లోనూ ఆకట్టుకున్నాం. కాకపోతే ఢిల్లీ వికెట్‌ నన్ను ఆశ్చర్యపరిచింది. ఇలా ఎలా మారిపోయిందో నాకు అర్థం కాలేదు. మేము ఢిల్లీ వచ్చినప్పుడు ఈ వికెట్‌ ఇలా ఉంటుందని అసలు ఊహించలేదు. వికెట్‌ చాలా బాగుంది. ఇక్కడ మంచు లేదు.. ఇది చాలా మంచి విషయం. మంచులేకపోతే 170 పరుగులు మంచి స్కోరే. కానీ మా ఓపెనింగ్‌ భాగస్వామ్యం అద్భుతంగా బ్యాటింగ్‌ చేయడంతో మాకు టార్గెట్‌ పెద్ద కష్టంగా అనిపించలేదు.

ఇది గత సీజన్‌ నుంచి వచ్చిన మార్పే. బాగా ఆడితే తుది జట్టు కూర్పుపై ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు.. ఆడకపోతే సమస్యగానే ఉంటుంది. మేము సుమారు 5-6 నెలల నుంచి క్రికెట్‌కు దూరంగానే ఉన్నాం. ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది. సొంతంగా ప్రాక్టీస్‌ అనేది కూడా చేయలేం. సుదీర్ఘ కాలంగా క్వారంటైన్‌లో ఉండటం అలానే మరికొన్ని విషయాలు ప్రాక్టీస్‌ను దూరం చేశాయి.

మా ఆటగాళ్లంతా ఈ సీజన్‌లో మరింత బాధ్యతను తీసుకున్నారు. గత 8-10 సంవత్సరాల నుంచి మా జట్టులో భారీ మార్పులు లేవు. దాంతో ఎలా ముందుకు వెళ్లాలి అనే విషయాలు వారికే అర్థమవుతాయి. చాలా మంది ఆటగాళ్లకు తుది జట్టులో ఆడేందుకు ఎక్కువ అవకాశం రావడం లేదు. వారిని అభినందించక తప్పదు. డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావారణం ఆరోగ్యకరంగా ఉండటం అనేది చాలా ముఖ్యం. అది అంత ఈజీ కాదు. నువ్వు టాప్‌ లెవల్‌లో ఉన్నప్పుడు ఆడటానికి స్వేచ్ఛ దొరకుతుంది’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు