IPL 2021: కేకేఆర్‌కు భారీ షాక్.. కెప్టెన్‌తో పాటు ఆటగాళ్లకు కూడా భారీ జరిమానా

24 Sep, 2021 09:54 IST|Sakshi
Courtesy : PHOTO IPL Website

KKR skipper Eoin Morgan fined INR 24 lakh: గెలుపు జోష్‌లో ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు భారీ షాక్‌ తగిలింది. కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌తో పాటు తుదిజట్టులోని ఆటగాళ్లకు జరిమానా విధించారు. ఐపీఎల్‌-2021 రెండో అంచెలో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా సారథి మోర్గాన్‌కు రూ. 24 లక్షలు, ఆటగాళ్లకు కనీసం 6 లక్షల రూపాయలు లేదా మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించారు. రెండోసారి ఈ తప్పిదం చేసినందుకుగానూ ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు ఫైన్‌ వేసింది.

ఇందుకు సంబంధించి.. ‘‘ఐపీఎల్‌ నియమావళిని అనుసరించి.. కనీస ఓవరు రేటు మెయింటెన్‌ చేయని కారణంగా.. రెండోసారి ఈ తప్పు పునరావృతం చేసినందుకు కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌కు 24 లక్షల జరిమానా విధించాం. ఇక తుదిజట్టులో ఆడిన ప్లేయర్లకు ఒక్కొక్కరి ఫీజులో 25 శాతం కోత లేదంటే 6 లక్షల ఫైన్‌ వేశాం’’ అని ఐపీఎల్‌ ప్రకటన విడుదల చేసింది. 

Courtesy : PHOTO IPL Website

కాగా ఈ సీజన్‌ ఆరంభంలో చెన్నై సూపర్‌కింగ్స్‌తో ఏప్రిల్‌ 21న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో.. ఇదే తరహాలో స్లో ఓవర్‌ రేటు కారణంగా కేకేఆర్‌ కెప్టెన్‌ మోర్గాన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఇక గురువారం అబుదాబిలో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ ఏడు వికెట్ల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ సందర్భంగా మోర్గాన్‌ మాట్లాడుతూ.. ముంబై వంటి మేటి జట్టుపై విజయం తమ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసిందన్నాడు. యువ ఆటగాళ్లు మెరుగ్గా రాణించారని వెంకటేశ్‌ అయ్యర్‌, రాహుల్‌ త్రిపాఠిపై ప్రశంసలు కురిపించాడు.

చదవండి: IPL 2021: కోహ్లికి షాకివ్వనున్న ఆర్సీబీ యాజమాన్యం.. నిజమేనా?!

>
మరిన్ని వార్తలు