ఆ బంతిని కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం!

2 May, 2021 10:28 IST|Sakshi
Photo Courtesy: IPL

ఢిల్లీ: ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే 219 పరుగుల టార్గెట్‌ ఇచ్చిన తర్వాత మ్యాచ్‌ ఫలితం ముందే డిసైడ్‌  అయిపోయిందనుకున్నారంతా. ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మెన్‌ ప్రస్తుత ఫామ్‌ను బట్టి ఇంత టార్గెట్‌ వారి వల్ల కాదనుకున్నారు. మరి డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో దిగిన ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు ట్రోఫీని ఎలా గెలిచిందో సీఎస్‌కేతో​ మ్యాచ్‌ను బట్టి అర్థమవుతోంది. ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ అంతా భారీ హిట్టర్లతో ఉంది.

ఒక బ్యాట్స్‌మన్‌ క్లిక్‌ కాకపోయినా ఎవరో ఒకరు సెట్‌ అయితే మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసి ఆటగాళ్లు వారి సొంతం. అదే జరిగింది శనివారం(మే 1వ తేదీ) నాటి మ్యాచ్‌లో. కీరోన్‌ పొలార్డ్‌ సునామీ ఇన్నింగ్స్‌తో ముంబై ఊహించని విజయాన్ని అందుకుంది. ప్రధానంగా ఆఖరి ఓవర్‌లలో 16 పరుగులు కావాల్సిన తరుణంలో ముంబై విజయం కష్టమే అనిపించింది. కానీ పొలార్డ్‌ క్రీజ్‌లో ఉన్నాడన్న దీమా మాత్రం ముంబై శిబిరంలో ఉంది. దాన్ని నిజం చేశాడు పొలార్డ్‌.  ఆ ఓవర్‌లో రెండు బంతులకు సింగిల్‌ వచ్చే అవకాశం ఉన్నా పొలార్డ​ తీయలేదు. ఎన్‌గిడి వేసిన 20వ ఓవర్‌ తొలి బంతిని ఫ్లిక్‌ చేసి సింగిల్‌ తీసే అవకాశం ఉన్నా వద్దనుకున్నాడు. ఆ తర్వాత రెండు బంతుల్ని ఫోర్లు కొట్టాడు. మళ్లీ నాల్గో బంతికి నో సింగిల్‌. ఐదో బాల్‌ సిక్స్‌, ఆరో బాల్‌ రెండు పరుగులు. అంతే లాంఛనం పూర్తయ్యింది.

ఆ బంతిని కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం!


Photo Courtesy: IPL

34 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన పొలార్డ్‌.. ఆఖరి ఓవర్‌లో కొట్టిన ఒక ఫోర్‌.. సీఎస్‌కే ఆటగాళ్లు అసలు ఊహించి ఉండరు. ఆఖరి ఓవర్‌ రెండో బంతిని ఎన్‌గిడి కాళ్ల మధ్యలో ఫెర్‌ఫెక్ట్‌ యార్కర్‌ వేశాడు. దాదాపు 140 కి.మీ వేగంతో వచ్చిన ఆ బంతి మిస్సయితే పొలార్డ్‌ బౌల్డ్‌ కావాల్సిందే. మరి పొలార్డ్‌ ఆ బంతి యార్కర్‌ పడటమే తరువాయి ఒక లెగ్‌ను కాస్త ఎడంగా తీసుకుని స్క్వేర్‌ లెగ్‌ మీదుగా ఫోర్‌ కొట్టాడు.

ఆ బంతిని ఫోర్‌ కొట్టడంతో ధోనితో సహా ఎన్‌గిడి కూడా ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇది కూడా ఫోర్‌ కొడితే ఇంకేం చేస్తాం అన్న భావన ఎన్‌గిడిలో కనబడింది. మంచి బంతిని ఫోర్‌గా కొట్టడంతో ధోని కూడా బౌలర్‌ను ఏమీ అనలేని పరిస్థితి లేదు. ఆ బంతిని ఫోర్‌ కొట్టడం అంటే అది నిజంగా బ్యాట్స్‌మన్‌ గొప్పదనమే. కీలక సమయంలో అది ఫోర్‌ కావడంతో ముంబై ఇండియన్స్‌ అభిమానులు ఖుషీ అయ్యారు. కాకపోతే ఆ బంతిని ఫోర్‌ కొట్టడం మాత్రం​ బౌలర్‌ కోణంలో అన్‌ఫెయిర్‌ అనుకోవచ్చని స్టూడియోల్లో కూర్చొన్న అనలిస్టులు సరదాగా వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు