IPL 2021: గుండె పగిలింది... మీరంతా జాగ్రత్త: పూరన్‌

7 May, 2021 14:32 IST|Sakshi
Photo Courtesy : IPL Twitter

న్యూఢిల్లీ: వైఫల్యాలను అధిగమించి రెట్టింపు ఉత్సాహంతో తిరిగి ఫాంలోకి వస్తానంటున్నాడు పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాడు నికోలస్‌ పూరన్‌. ఐపీఎల్‌-2021లో భాగంగా పంజాబ్‌ తరఫున బరిలో దిగిన ఈ విండీస్‌ క్రికెటర్‌ అత్యంత ఘోరంగా విఫలమయ్యాడు. ఆరు మ్యాచ్‌లలో నాలుగుసార్లు డకౌట్‌గా వెనుదిరిగాడు. రాజస్తాన్‌, సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌, ఆర్సీబీతో జరిగిన పంజాబ్‌ మ్యాచ్‌లో ఈ చెత్త గణాంకాలు నమోదు చేశాడు. తద్వారా ఈ సీజన్‌లో అత్యధికసార్లు ఔటైన ఆటగాడిగా నిలిచాడు. ఇక ఢిల్లీతో ఆడిన మ్యాచ్‌లో 9, కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 19 పరుగులు మాత్రమే చేసి పూర్తిగా నిరాశపరిచాడు.

దీంతో.. పూరన్‌ను తుదిజట్టులోకి తీసుకోవడం మూర్ఖత్వమేనంటూ సోషల్‌ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తాయి. అతడిని వెంటనే తొలగించాలంటూ పంజాబ్‌ ఫ్యాన్స్‌ డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే.. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్‌-2021 నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఇప్పటికే ఇంటిబాట పట్టగా, నికోలస్‌ పూరన్‌ వంటి క్రికెటర్లు మరికొందరు సైతం స్వదేశాలకు పయనమయ్యారు. ఈ సందర్బంగా పూరన్‌ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. 

ఈ మేరకు.. ‘‘టోర్నమెంట్‌ను వాయిదా వేయడం, అందుకు గల కారణాలు గుండెలు బద్దలు చేస్తున్నాయి. కానీ ప్రస్తుతం పరిస్థితుల్లో ఇలా చేయడమే సరైనది, అత్యవసరం. త్వరలోనే మళ్లీ వస్తాను ఐపీఎల్‌! అప్పటి వరకు ఈ ఫొటోను చూసుకుంటాను. స్ఫూర్తి పొంది రెట్టింపు శక్తితో తిరిగి వస్తాను. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండండి’’ అని విజ్ఞప్తి చేశాడు. ఈ సీజన్‌లో తన వైఫల్యాన్ని ప్రతిబింబించే గణాంకాల ఫొటోను ఇందుకు జతచేశాడు. కాగా కోవిడ్‌పై భారత్‌ పోరులో భాగంగా పూరన్‌ తన వంతు సాయం చేశాడు. ఐపీఎల్‌ ద్వారా తనకు లభించే ఆదాయం నుంచి కొంతమొత్తం విరాళంగా ఇచ్చి పెద్ద మనసు చాటుకున్నాడు. 

చదవండి: IPL 2021: నీ వల్లే ఐపీఎల్‌ ఆగిపోయిందంటూ నెటిజన్ల ఫైర్‌!

మరిన్ని వార్తలు