విరుష్క జంటతో అజహరుద్దీన్‌‌..

22 Apr, 2021 18:19 IST|Sakshi
courtesy: IPL Twitter

ముంబై: ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఐపీఎల్‌ వేళంలో కేరళ కుర్రాడు మహ్మద్‌ అజహారుద్దీన్‌ను రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత దేశవాళీ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో రెండో వేగవంతమైన సెంచరీ బాది వెలుగులోకి వచ్చిన అజహార్‌.. గురువారం రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు కోహ్లి దంపతులతో కలిసి తీయించుకున్న ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. గొప్ప మనసున్న వ్యక్తులను కలసుకోవటం చాలా సంతోషాన్ని కలిగించింది, విరుష్క జోడీ ఏమాత్రం దర్పం చూపించకుండా నాతో ఫోటో దిగడం నిజంగా నా అదృష్టం అంటూ కోహ్లి దంపతులను ట్యాగ్‌ చేస్తూ క్యాప్షన్‌ జోడించాడు. అజహర్‌ షేర్‌ చేసిన ఈ ట్వీట్‌ ప్రస్తుతం నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. 

అనామక ఆటగాడితో కలిసి కోహ్లి దంపతులు చనువుగా ఫోటోలు దిగడం వారి గొప్ప మనసుకు నిదర్శనమని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా, ప్రస్తుత సీజన్‌లో కోహ్లి నేతృత్వంలోని ఆర్‌సీబీ జట్టు హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి మాంచి జోరుమీదుండగా, అజహార్‌ అరంగేట్రానికి మాత్రం ఇంకా అవకాశం లభించలేదు. ఆర్‌సీబీ తుది జట్టులో దేశీయ ఆటగాళ్లందరూ రాణిస్తుండటంతో అతను మరికొంత కాలం వేచి చూడల్సి ఉంటుంది.

ఇదిలా ఉంటే, గత సీజన్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 54 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 137 పరుగులు చేసిన ఈ 26 ఏళ్ల కుర్రాడు.. 37 బంతుల్లోనే శతకం సాధించి, టోర్నీ చరిత్రలో రెండో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుత ఢిల్లీ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 32 బంతుల్లో చేసిన శతకం ముస్తాక్‌ అలీ ట్రోఫీ చరిత్రలో అత్యంత వేగవంతమైన సెంచరీగా రికార్డుల్లో కొనసాగుతుంది.
చదవండి: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన మహేంద్రుడు..

మరిన్ని వార్తలు