బెయిర్‌స్టో అప్పుడు టాయిలెట్‌లో ఉంటే తప్ప..

26 Apr, 2021 12:41 IST|Sakshi
Courtesy: IPL Twitter

చెన్నై: ఐపీఎల్‌-2021లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అనుసరించిన వ్యూహాలపై క్రీడా విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఆఖరి దాకా పోరాడి కూడా స్వీయ తప్పిదాల వల్ల మ్యాచ్‌ను చేజార్చుకుందంటూ విమర్శిస్తున్నారు. చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ సీజన్‌లో తొలి సూపర్‌ ఓవర్‌ నమోదైన సంగతి తెలిసిందే. తొలుత పంత్‌ సేన 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగా, కేన్‌ విలియమ్సన్‌, జానీ బెయిర్‌స్టో రాణించడంతో సన్‌రైజర్స్‌ సైతం 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయడంతో మ్యాచ్‌ టై అయ్యింది. దీంతో సూపర్‌ నిర్వహించగా, హైదరాబాద్‌ 7 పరుగులు చేయగా... ఢిల్లీ 8 పరుగులు చేసి గెలుపొందింది. 

ఈ నేపథ్యంలో సూపర్‌ ఓవర్‌లో ఓపెనర్‌ జానీ బెయిర్‌ స్టోను ఆడించకపోవడంపై టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ విషయంపై ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ఈ మ్యాచ్‌లో మెయిన్‌ ఇన్నింగ్స్‌లో బెయిర్‌ స్టో 18 బంతుల్లో 38 పరుగులు చేశాడు. హిట్టింగ్‌తో ఆకట్టుకున్నాడు. సూపర్‌ ఓవర్‌ జరుగుతున్న సమయంలో, ఒకవేళ బెయిర్‌ స్టో గనుక టాయిలెట్‌లో ఉండి ఉంటే తప్ప, అతడిని ఎందుకు ఆడించలేదో అర్థం కావడం లేదు. హైదరాబాద్‌ పోరాట పటిమ కనబరిచింది. కానీ, వింతైన, అనూహ్య నిర్ణయాల కారణంగా వారిని వారు నిందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది’’ అని వీరూ భాయ్ వార్నర్‌ కెప్టెన్సీపై ఘాటుగా స్పందించాడు.

అదే విధంగా, ఇంగ్లండ్‌మాజీ ఓపెనర్‌ నిక్‌ కాంప్టన్‌ సైతం ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. ప్రపంచంలోని ప్రస్తుత బెస్ట్‌ టాపార్డర్‌ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన బెయిర్‌స్టో సూపర్‌ ఓవర్‌లో ఎందుకు బ్యాటింగ్‌ చేయలేదు? అని ప్రశ్నించాడు.  ఈ నేపథ్యంలో నెటిజన్లు సైతం సెహ్వాగ్‌ అభిప్రాయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అప్పటికే అలసిపోయిన విలియమ్సన్‌ బదులు బెయిర్‌స్టోను పంపించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.

చదవండి: SRH vs DC: ‘సూపర్‌’లో రైజర్స్‌ విఫలం

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు