IPL 2024 RR VS DC: చరిత్ర సృష్టించనున్న రిషబ్‌ పంత్‌

28 Mar, 2024 12:06 IST|Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా జైపూర్‌ వేదికగా రాజస్థాన్‌ రాయల్స్‌తో ఇవాళ (మార్చి 28) జరుగబోయే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ సారధి రిషబ్‌ పంత్‌ చరిత్ర సృష్టించనున్నాడు. ఈ మ్యాచ్‌తో ఢిల్లీ తరఫున 100 మ్యాచ్‌ల మైలురాయిని తాకనున్న పంత్‌.. ఐపీఎల్‌ చరిత్రలో ఈ ఫ్రాంచైజీ తరఫున 100 మ్యాచ్‌ల మైలురాయిని తాకనున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కనున్నాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 99 మ్యాచ్‌లు ఆడిన పంత్‌.. సెంచరీ, 15 హాఫ్‌ సెంచరీల సాయంతో 2856 పరుగులు చేసి, ఢిల్లీ తరఫున లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా ఉన్నాడు. 

26 ఏళ్ల పంత్‌ 2022 చివర్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి గతేడాది ఐపీఎల్‌తో పాటు 15 నెలలు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌తో క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన పంత్‌.. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో 13 బంతుల్లో 2 ఫోర్ల సాయంతో 18 పరుగులు చేసి మమ అనిపించాడు. బ్యాటింగ్‌లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోయిన పంత్‌.. వికెట్‌ కీపింగ్‌లో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో పంత్‌ ఓ స్టంపౌట్‌ చేయడంతో పాటు ఓ క్యాచ్‌ పట్టుకున్నాడు. 

పంజాబ్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాళ్లెవ్వరూ చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. ఫలితంగా 4 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ.. నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. వార్నర్‌ (29), మిచెల్‌ మార్ష్‌ (20), షాయ్‌ హోప్‌ (33), అక్షర్‌ పటేల్‌లకు (21) శుభారంభాలు లభించినప్పటికీ వాటిని భారీ స్కోర్లుగా మలచుకోలేకపోయారు.

ఆఖర్లో అభిషేక్‌ పోరెల్‌ (10 బంతుల్లో 32 నాటౌట్‌; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడకపోయుంటే ఢిల్లీ ఈ మాత్రం స్కోరైనా చేయలేకపోయేది. పంజాబ్‌ బౌలర్లు అర్ష్‌దీప్‌, హర్షల్‌ పటేల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రబాడ, హర్ప్రీత్‌ బ్రార్‌, రాహుల్‌ చాహర్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పంజాబ్‌.. సామ్‌ కర్రన్‌ (47 బంతుల్లో 63), లివింగ్‌స్టోన్‌ (21 బంతుల్లో 38 నాటౌట్‌) రాణించడంతో 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. పంజాబ్‌ ఇన్నింగ్స్‌లో శిఖర్‌ ధవన్‌ (22), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (26) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్‌ అహ్మద్‌, కుల్దీప్‌ యాదవ్‌ తలో వికెట్లు పడగొట్టగా.. ఇషాంత్‌ శర్మ ఓ వికెట్‌ దక్కించున్నాడు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers