IPL 2024 SRH Vs MI: సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌.. హార్దిక్‌ సెంచరీ

28 Mar, 2024 08:00 IST|Sakshi

ఐపీఎల్‌ 2024లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన ఏకైక సిక్సర్‌తో అతను ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున 100 సిక్సర్లను పూర్తి చేసుకున్నాడు. హార్దిక్‌కు ముందు కీరన్‌ పోలార్డ్‌ (223), రోహిత్‌ శర్మ (210) మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ముంబై ఇండియన్స్‌ తరఫున 94వ మ్యాచ్‌లో హార్దిక్‌ ఈ ఘనతను సాధించాడు.

ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో సిక్సర్‌, బౌండరీ సాయంతో 24 పరుగులు చేసిన హార్దిక్‌.. ఎంఐ తరఫున 1500 పరుగులను పూర్తి చేసుకున్నాడు. విధ్వంసకర ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌ ముంబై ఇండియన్స్‌ తరఫున 100 సిక్సర్ల మార్కుకు అతి చేరువలో ఉన్నారు. వీరిద్దరు ఎంఐ తరఫున 90 ప్లస్‌ సిక్సర్లు బాది హార్దిక్‌ వెనకాలే ఉన్నారు. హార్దిక్‌ ఓవరాల్‌గా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 124 మ్యాచ్‌లు ఆడి 127 సిక్సర్లు బాదాడు.

హార్దిక్‌ ఈ సీజన్‌ ప్రారంభానికి ముందే గుజరాత్‌ను వీడి ముంబై ఇండియన్స్‌ పంచన చేరాడు. వచ్చీ రాగానే ముంబై యాజమాన్యం రోహిత్‌ను కాదని హార్దిక్‌కు కెప్టెన్సీ కట్టబెట్టింది. హార్దిక్‌ సారథ్యంలో ముంబై ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో హార్దిక్‌ కెప్టెన్సీ విమర్శలు హోరెత్తుతున్నాయి. దీనికి తోడు ఓవరాక్షన్‌ (సీనియర్ల పట్ల చిన్నచూపు) అతన్ని మరింత అప్రతిష్టపాలు చేస్తుంది.

సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో కీలక సమయంలో బుమ్రాకు బౌలింగ్‌ ఇవ్వకపోవడంపై ముంబై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. హార్దిక్‌కు కెప్టెన్సీ చేతకాదని బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. బౌలర్లను మార్చే విషయంలో హార్దిక్‌ తేలిపోయాడని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ముంబై వరుస ఓటములకు హార్దికే ప్రత్యక్ష కారకుడని నిందిస్తున్నారు. 

కాగా, సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో పిచ్‌ను అంచనా వేయడంలో ఘోరంగా విఫలమైన హార్దిక్‌.. టాస్‌ గెలిచి ప్రత్యర్దిని బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకున్న సన్‌రైజర్స్‌ బ్యాటర్లు ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ను (277/3) నమోదు చేశారు.

ట్రవిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 62; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), అభిషేక్‌ శర్మ (23 బంతుల్లో 63; 3 ఫోర్లు, 7 సిక్సర్లు), హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 80 నాటౌట్‌; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు అర్దశతకాలతో విరుచుకుపడగా..  మార్క్రమ్‌ (28 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 42 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కష్ట సాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై తొలుత సన్‌రైజర్స్‌కు దడ పుట్టించినప్పటికీ.. లక్ష్యం అతి భారీది కావడంతో చివరికి చేతులెత్తేసింది.

ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 34; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోహిత్‌ శర్మ (12 బంతుల్లో 26; ఫోర్‌, 2 సిక్సర్లు), నమన్‌ ధిర్‌ (14 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), తిలక్‌ వర్మ (34 బంతుల్లో 64; 2 ఫోర్లు, 6 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 42 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) సన్‌రైజర్స్‌ శిబిరంలో కలకలం సృష్టించారు. ముంబై ఇన్నింగ్స్‌లో హార్దిక్‌ పాండ్యా (20 బంతుల్లో 24; ఫోర్‌, సిక్స్‌) ఒక్కడే నిదానంగా ఆడాడు. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసిన ముంబై లక్ష్యానికి 32 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers