Kartik Tyagi: ఆఖరి ఓవర్‌ బౌలింగ్‌ చేయడం అంత సులువు కాదు.. కానీ కార్తిక్‌

22 Sep, 2021 14:54 IST|Sakshi
Courtesy: IPL Twitter

Irfan Pathan Lauds Kartik Tyagi.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ ఫేజ్‌లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ కార్తిక్‌ త్యాగి హీరోగా నిలిచిన సంగతి తెలిసిందే. ఆఖరి ఓవర్‌లో పంజాబ్‌కు నాలుగు పరుగులు అవసరమైన దశలో కార్తిక్‌ త్యాగి అద్భుతంగా బౌలింగ్‌ చేసి నికోలస్‌ పూరన్‌, దీపక్‌ హుడా వికెట్లు తీసి రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ సందర్భంగా కార్తిక్‌ త్యాగిపై అన్ని వైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తుంది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్పాన్‌ పఠాన్‌ కూడా  కార్తిక్ త్యాగిపై ఆసక్తికరవ్యాఖ్యలు చేశాడు.

'కార్తిక్‌ త్యాగి ఒక యంగ్‌స్టర్‌.. ఎలాంటి అనుభవం లేని ఆటగాడు. ఒక అన్‌క్యాప్‌ ప్లేయర్‌ ఇలాంటి ప్రదర్శన కనబరచడం సంతోషం కలిగించింది. ఆఖరి ఓవర్లో ‌ ప్రత్యర్థి జట్టుకు నాలుగు పరుగులు ఇవ్వకుండా అడ్డుకోవడం అంత సులువు కాదు. కానీ కార్తిక్‌ ఆ ఒత్తిడిని అధిగమించి సూపర్‌ బౌలింగ్‌ కనబరిచాడు. త్వరలోనే జాతీయ జట్టు తలుపు తట్టే అవకాశం ఉంది.' అని తెలిపాడు.  

186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్‌ కింగ్స్‌ 19వ ఓవర్లో 4 పరుగులే చేసిన పంజాబ్‌ జట్టు... కార్తీక్‌ త్యాగి వేసిన ఆఖరి ఓవర్లో గెలిచేందుకు 4 పరుగులు చేయాలి. కానీ పంజాబ్‌ జట్టు ఒకటే పరుగు చేసి 2 వికెట్లు కూడా కోల్పోయి చేతులెత్తేసింది. చివరకు 2 పరుగుల తేడాతో రాజస్తాన్‌ రాయల్స్‌ అనూహ్య విజయాన్నందుకుంది. ముందుగా రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. యశస్వి (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మహిపాల్‌ లోమ్రోర్‌ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఎవిన్‌ లూయిస్‌ (21 బంతుల్లో 36; 7 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. పంజాబ్‌ బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్‌ 32 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేదనలో పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 183 పరుగులకే పరిమితమైంది. మయాంక్‌ (43 బంతుల్లో 67; 7 ఫోర్లు 2 సిక్సర్లు), రాహుల్‌ (33 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 71 బంతుల్లోనే 120 పరుగులు జోడించినా ఫలితం దక్కలేదు.   

చదవండి: Fabian Allen: ఫాబియెన్‌ అలెన్‌ కళ్లు చెదిరే క్యాచ్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు