నేనింకా రిటైర్‌ కాలేదు.. రిటైర్మెంట్‌ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్‌

25 Jan, 2024 11:03 IST|Sakshi

భారత బాక్సింగ్‌ దిగ్గజం మేరీ కోమ్‌ రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ‍ప్రచారం జరిగింది. తాజాగా కోమ్‌ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్‌పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది.  తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్‌ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్‌ మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్‌ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్‌.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది.

ఓవరాల్‌గా మేరీ కోమ్‌ తన కెరీర్‌లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్‌ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్‌ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్‌ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్‌ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది.

whatsapp channel

మరిన్ని వార్తలు