MS Dhoni: ధోని ముసలోడే కదా.. అందుకే అలా అన్నాను: సెహ్వాగ్‌

28 Mar, 2024 19:18 IST|Sakshi

టీమిండియా మాజీ క్రికెటర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఛలోక్తులు విసరడంలో దిట్ట అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రిటైర్మెంట్‌ తర్వాత ఈ విధ్వంసకర ఓపెనర్‌ కామెంటేటర్‌, విశ్లేషకుడిగా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌-2024 హర్యానా కామెంట్రీతో బిజీగా ఉన్నాడు.

ఈ క్రమంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ స్టార్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని ఉద్దేశించి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశాడు సెహ్వాగ్‌. గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే ఫీల్డింగ్‌ను ప్రశంసిస్తూ.. ‘‘క్యాచెస్‌ విన్‌ మ్యాచెస్‌ అంటారు కదా.

అజింక్య రహానే మంచి క్యాచ్‌ అందుకున్నాడు. రచిన్‌ రవీంద్ర కూడా అద్బుతంగా క్యాచ్‌ పట్టాడు. వయసు మీద పడ్డ ధోని కూడా ఓ క్యాచ్‌ అందుకున్నాడు’’ అని క్రిక్‌బజ్‌ షోలో వ్యాఖ్యానించాడు. ఇందుకు స్పందనగా అక్కడే ఉన్న మరో మాజీ క్రికెటర్‌ రోహన్‌ గావస్కర్‌.. ‘‘రహానే విషయంలో ఆ పదం(ముసలోడు అన్న అర్థంలో) ఎందుకు వాడలేదు’’ అని ప్రశ్నించాడు. 

ఇందుకు బదులిస్తూ.. ‘‘వాళ్లిద్దరి వయసు ఒకటి కాదు కదా! ధోని కంటే రహానే ఫిట్‌గా ఉన్నాడు. 35 ఏళ్ల వ్యక్తికి.. 41 ఏళ్లు పైబడిన వ్యక్తికి మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ధోనికి వయసు మీద పడుతుందన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు కదా’’ అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. రహానే నూటికి నూరు శాతం ధోని కంటే ఎక్కువ ఫిట్‌గా ఉన్నాడు కాబట్టే అతడిని అలా అనలేదని పేర్కొన్నాడు.

కాగా గుజరాత్‌ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ధోని అద్బుత రీతిలో డైవ్‌ చేసి.. గుజరాత్‌ బ్యాటర్‌ విజయ్‌ శంకర్‌ను పెవిలియన్‌కు పంపాడు.

పాదరసంలా కదిలి శరీరాన్ని స్ట్రెచ్‌ చేసి బంతిని ఒడిసిపట్టాడు. ఇక ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ మిల్లర్‌(16 బంతుల్లో 21) ఇచ్చిన క్యాచ్‌ను అజింక్య రహానే, అజ్మతుల్లా ఇచ్చిన క్యాచ్‌ను రచిన్‌ రవీంద్ర సంచలన క్యాచ్‌లతో మెరిసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 

ఈ విషయంపై స్పందిస్తూ కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సైతం.. ధోని, రహానే, రచిన్‌లను కొనియాడాడు. ధోని, రహానేను చూస్తుంటే తమ జట్టులో అదనంగా ఇద్దరు కుర్రాళ్లు ఉన్నట్లు అనిపిస్తోందంటూ ప్రశంసలు కురిపించాడు. 

Election 2024

మరిన్ని వార్తలు