ENG vs PAK: ఇదేం బుద్ధి? స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని పాక్ క్రికెటర్! వీడియో వైరల్

13 Dec, 2022 11:20 IST|Sakshi

ముల్తాన్‌ వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 26 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 2-0 తేడాతో ఇంగ్లండ్‌ సొంతం చేస్తుంది. కాగా 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై ఇంగ్లండ్‌కు ఇదే తొలి టెస్టు సిరీస్‌ విజయం కావడం గమనార్హం.

ఇక నాలుగో రోజు ఆటను 198-4 పరుగుల వద్ద  ప్రారంభించిన పాకిస్తాన్‌కు సౌద్ షకీల్, ఇమాముల్ హక్ లు ఐదో వికెట్ కు 80 పరుగుల భాగస్వామ్యం అందించారు. దీంతో పాక్‌ సునాయసంగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. ఇక్కడే ఇంగ్లండ్‌ బౌలర్లు మ్యాజిక్‌ చేశారు. లంచ్‌ విరామం తర్వాత షకీల్, ఇమాముల్ ఔటయ్యక పాక్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది.

అయితే ఆఖరిలో అగా సల్మాన్ పోరాడనప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు. ఇక పదకొండో నెంబర్ బ్యాటర్ మహ్మద్‌ అలీని రాబిన్సన్‌ ఔట్‌ చేసి ఇంగ్లండ్‌ జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

బెన్ స్టోక్స్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని పాక్ క్రికెటర్‌
రాబిన్సన్‌ వేసిన బంతి మహ్మద్‌ అలీ బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని వికెట్‌ కీపర్‌ ఓలీ పోప్‌ చేతికి వెళ్లింది. దాన్ని అంపైర్‌ ఔట్‌గా ప్రకటించాడు. దీంతో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు గెలుపు సంబరాలు జరపుకున్నారు. అయితే బంతి బ్యాట్‌కు సృష్టంగా తగిలినప్పటికీ మహ్మద్‌ అలీ మాత్రం రివ్యూ కోరాడు. థర్డ్‌ అంపైర్‌ నిర్ణయం కోసం వేచి వుండే క్రమంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌ అలీతో కరచాలనం చేసేందుకు వచ్చాడు.

అయితే స్టోక్స్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు అలీ నిరాకరించాడు. అతనితో ఏదో అన్నాడు. అంతే వెంటనే స్టోక్స్ తన చేతిని వెనక్కు తీసుకున్నాడు. అయితే థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గా ప్రకటించిన అనంతరం మహ్మద్‌ అలీ.. స్టోక్స్‌తో పాటు పలు ఇంగ్లండ్ ఆటగాళ్లకు షేక్‌ హ్యాండ్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే అలీ తీరుపై నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు. ఇదేం బుద్దిరా బాబు.. ఆటలో గెలుపు ఓటములు సహాజం అంటూ పోస్టులు చేస్తున్నారు.
చదవండిఆస్పత్రి బెడ్‌పై భారత ఆటగాడు.. ఆ టోర్నీ మొత్తానికి దూరం!

>
మరిన్ని వార్తలు